అంతర్జాతీయ రాకపోకలకు అనుమతి

అంతర్జాతీయ ప్రయాణాలపై విధించిన ఆంక్షలను కేంద్రం దశల వారీగా సడలించనుంది.

Published : 22 Oct 2020 17:38 IST

దిల్లీ: కొవిడ్‌-19 మహమ్మారి వల్ల తలెత్తిన అత్యయిక పరిస్థితి నేపథ్యంలో ఫిబ్రవరి నుంచి అంతర్జాతీయ రాకపోకలపై ఆంక్షలు అమలులో ఉన్న సంగతి తెలిసిందే. కాగా ప్రయాణాలపై విధించిన ఆంక్షలను కేంద్రం దశల వారీగా సడలించనుంది. ఈ క్రమంలో దేశంలోకి భారతీయులు, విదేశీయుల రాకపోకలపై ఆంక్షలను ఎత్తివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు హోంశాఖ విడుదల చేసిన ఓ ప్రకటనలో పర్యాటక వీసా మినహా అన్ని వర్గాల ప్రయాణాలకు అనుమతులు ఇవ్వనున్నట్టు తెలిపింది. అయితే ప్రయాణికులందరూ ఆరోగ్య శాఖ సూచించిన ప్రకారం క్వారంటైన్‌ తదితర నిబంధనలను పాటించాల్సి ఉంటుందని వివరించింది.

విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు (ఓసీఐ), భారతీయ మూలాలున్న వ్యక్తులతో (పీఐఓ) సహా విదేశీయులెవరైనా  జల, ఆకాశ మార్గాల ద్వారా భారత్‌కు వచ్చేందుకు అనుమతిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. వందే భారత్‌ మిషన్‌, ఎయిర్‌ బబుల్‌ ఒప్పందం లేదా పౌర విమానయాన శాఖ గుర్తించిన ఏ విమాన సర్వీసుల ద్వారా వచ్చే ప్రయాణికులనైనా అనుమతిస్తామని వెల్లడించింది. ఇందుకు అనుగుణంగా ప్రస్తుతమున్న వీసాలన్నింటినీ క్రియాశీలం చేస్తున్నట్టు హోంశాఖ ప్రకటించింది. ఎలక్ట్రానిక్‌ , పర్యాటక, వైద్య సంబంధ వీసాలు మినహా ఇతర వీసా సేవలన్నిటినీ పునరుద్ధరించనున్నారు. ప్రయాణికుల వీసా చెల్లుబాటు తేదీ మించినట్లయితే, కొత్త వీసాలను సంబంధిన భారతీయ సంస్థలనుంచి పొందవచ్చని సూచించింది. ఇక  వైద్య చికిత్స తదితర కారణాల వల్ల భారత్‌కు రావాలనుకునే విదేశీయులు, వారికి సహాయంగా వచ్చే వారు కూడా మెడికల్‌ వీసాకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని