రైతులను కాదని.. హైదరాబాద్‌కు షా: ఆప్‌

కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న రైతులతో కేంద్ర ప్రభుత్వం తక్షణమే చర్చలు చేపట్టాలని దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. రైతుల నిరసనకు ఆమ్‌ ఆద్మీ పార్టీ మద్దతు ఉంటుందని..

Published : 30 Nov 2020 01:03 IST

దిల్లీ: కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న రైతులతో కేంద్ర ప్రభుత్వం తక్షణమే చర్చలు చేపట్టాలని దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. రైతుల నిరసనకు ఆమ్‌ ఆద్మీ పార్టీ మద్దతు ఉంటుందని.. కేంద్రం తక్షణమే జోక్యం చేసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌ వేదికగా తెలిపారు. ‘ఎలాంటి షరతులు విధించకుండా కేంద్ర ప్రభుత్వం తక్షణమే రైతులతో చర్చలు జరపాలి’ అని కేజ్రీవాల్‌ పేర్కొన్నారు.

అదే విధంగా ఆప్‌ అధికార ప్రతినిధి సౌరభ్‌ భరద్వాజ్‌ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘లక్షలాది రైతులు తమ సమస్యలపై దిల్లీకి వస్తే కేంద్ర హోంమంత్రి అమిత్‌షా హైదరాబాద్‌లో జరుగుతున్న మున్సిపల్‌ ఎన్నికల ప్రచారానికి వెళ్లడం బాధ్యత రాహిత్యమే. ఓ వైపు రైతులు చేస్తున్న నిరసన కారణంగా కరోనా వైరస్‌ వ్యాప్తి పెరుగుతోందని అమిత్‌షా చెబుతున్నారు. మరోవైపు హైదరాబాద్‌లో ఆయనే పెద్ద ఎత్తున ప్రజలతో ఎన్నికల రోడ్‌షోలు నిర్వహిస్తున్నారు. ఇటువంటి బాధ్యతా రాహిత్య చర్యలను మేం ఖండిస్తున్నాం’ అని భరద్వాజ్‌ తీవ్ర విమర్శలు చేశారు. కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్‌, హరియాణా రైతులు చలో దిల్లీ ర్యాలీకి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గత నాలుగు రోజులుగా వారు దిల్లీ సరిహద్దుల్లో నిరసనలు చేస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని