ఉన్నత విద్యకు అంతర్జాతీయ హబ్‌గా భారత్‌: మోదీ 

దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లడానికి అన్ని రంగాల్లో అవసరమైన మార్పులు చేపడుతున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. అంతర్జాతీయంగా ఉన్నత విద్యకు భారత్‌ను హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రధాని పేర్కొన్నారు.

Published : 19 Oct 2020 18:16 IST

బెంగళూరు: దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లడానికి అన్ని రంగాల్లో అవసరమైన మార్పులు చేపడుతున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. అంతర్జాతీయంగా ఉన్నత విద్యకు భారత్‌ను హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రధాని పేర్కొన్నారు. ఈ దశాబ్దాన్ని భారత దశాబ్దంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు మోదీ కర్ణాటకలోని మైసూరు విశ్వవిద్యాలయం పట్టా ప్రదాన కార్యక్రమంలో వర్చువల్‌గా పాల్గొని ప్రసంగించారు. 

‘ప్రస్తుతం దేశంలో అన్ని రంగాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా సంస్కరణలు ఊపందుకున్నాయి.  వ్యవసాయం, అంతరిక్షం, రక్షణ, వైమానిక, కార్మిక ఇలా అన్ని రంగాల్లో గత ఆరు నెలలుగా వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. గత ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకున్నప్పటికీ అది ఏదో ఒక రంగానికే పరిమితమయ్యేది. ఇతర రంగాలను పక్కన పెట్టే వారు. కానీ గత ఆరు నెలలుగా అన్ని రంగాల్లో మార్పులు తెచ్చేందుకు కేంద్రం ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది. ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన నూతన విద్యా విధానం(ఎన్‌ఈపీ) విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఇస్తుంది. ఈ దశాబ్దం భారతీయ యువతకు అపారమైన అవకాశాలు కల్పిస్తోంది’ అని మోదీ తెలిపారు.  

వ్యవసాయ బిల్లుల గురించి మాట్లాడుతూ.. ‘రైతుల సాధికారత కోసం వ్యవసాయ రంగంలో పలు మార్పులు చేస్తూ కీలకమైన బిల్లులను తీసుకువచ్చాం. అవి కేవలం రైతులనే కాకుండా వ్యవసాయ కూలీలను సైతం అభివృద్ధి మార్గంలో నడిపించేందుకు సహకరిస్తాయి. నూతన విద్యా విధానం ముఖ్యంగా నైపుణ్యాలపైనే దృష్టి సారించి యువతకు అన్ని రంగాల్లో పోటీ పడేలా తీర్చి దిద్దేందుకు తోడ్పడుతుంది. ఉన్నత విద్యలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంస్కరణలు చేపట్టాం. భారత్‌ను అంతర్జాతీయంగా ఉన్నత విద్యకు హబ్‌గా నిలపడానికి అన్ని రకాల ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి’ అని ప్రధాని పేర్కొన్నారు. 

ఈ సందర్భంగా మోదీ మైసూరు వర్శిటీ గొప్పతనాన్ని ప్రశంసించారు. కర్ణాటక ప్రజలకు మోదీ దసరా(నడ హబ్బా) శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల కర్ణాటకలో పలు ప్రాంతాల్లో సంభవించిన వర్షాలకు ప్రభావితమైన కుటుంబాలకు ప్రధాని సానుభూతి తెలిపారు. వారిని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక గవర్నర్‌, వర్శిటీ ఛాన్సలర్‌ వాజుభాయ్‌ వాలా, డిప్యూటీ సీఎం సీఎన్‌ అశ్వత్‌ నారాయణ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని