చైనీయుల టూర్‌: వారంలో రూ.5లక్షల కోట్ల ఖర్చు!

ఎనిమిది రోజులపాటు సాగిన ‘గోల్డెన్‌ వీక్‌’ హాలీడేలో దాదాపు 63కోట్ల మంది చైనీయులు స్వదేశీ పర్యటన చేశారు.

Published : 10 Oct 2020 01:47 IST

‘గోల్డెన్‌ వీక్‌’ హాలీడేలో 64కోట్ల మంది పర్యటన

హాంగ్‌కాంగ్‌: కరోనా వైరస్‌ సృష్టించిన విలయానికి ప్రపంచదేశాలు ఇప్పటికీ కొట్టుమిట్టాడుతూనే ఉన్నాయి. ఓ వైపు ఆరోగ్య, ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కొంటున్నాయి. కానీ, వైరస్‌కు మూలకారణమైన చైనాలో మాత్రం అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. తాజాగా జరిగిన ‘గోల్డెన్‌ వీక్’‌ హాలిడే ఇదే విషయాన్ని స్పష్టంచేస్తోంది. ఎనిమిది రోజులపాటు సాగిన ‘గోల్డెన్‌ వీక్‌’ హాలీడేలో దాదాపు 64కోట్ల మంది చైనీయులు స్వదేశీ పర్యటన చేశారు. దీంతో చైనా ప్రభుత్వానికి భారీ ఆదాయం వచ్చినట్లు చైనా పర్యాటకశాఖ ప్రకటించింది.

చైనాలో దేశవ్యాప్తంగా అక్టోబర్‌ 1 నుంచి 8 వరకు ‘గోల్డెన్‌ వీక్’‌ హాలిడే కొనసాగింది. ఈ సమయంలో చైనాలోని మొత్తం జనాభాలో 45శాతానికి పైగా ప్రజలు స్వదేశీ పర్యటనలు చేశారు. కేవలం ఎనిమిది రోజుల్లోనే 63.7కోట్ల మంది చైనీయులు స్వదేశీ విహారంలో మునిగితేలారు. అంతేకాకుండా చైనా పర్యాటకశాఖ ప్రకారం, వీరంతా ఈ ఎనిమిది రోజుల్లోనే దాదాపు రూ. 5లక్షల కోట్లు(69.50బిలియన్‌ డాలర్లు) ఖర్చుపెట్టారు. దీంతో చైనా పర్యాటక వ్యవస్థ తిరిగి గాడిలో పడేందుకు ఈ గోల్డెన్‌ వీక్‌ ఊతమిచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. గత సంవత్సరం గోల్డెన్‌ వీక్‌ పోలిస్తే ఈసారి 21శాతం పర్యాటకుల సంఖ్య తగ్గగా, ఖర్చు పెట్టే సామర్థ్యం 30శాతం క్షీణించిందని వెల్లడించారు. అయితే, కరోనా వైరస్‌ తర్వాత కూడా ఖర్చుపెట్టేందుకు వెనకాడడం లేదనే విషయం తెలుస్తోందని అభిప్రాయపడ్డారు.

వుహాన్‌ నగరంలో గత ఏడాది బయటపడ్డ కరోనా వైరస్‌ కారణంగా గత జనవరిలో లూనార్‌ న్యూఇయర్‌ వేడుకలకు అనుమతి ఇవ్వలేదు. అంతేకాకుండా పలు నగరాలకు వెళ్లేందుకు ఆంక్షలు విధించింది. మే లో జరిగిన ఐదు రోజుల ‘లేబర్‌ హాలిడే’లో మాత్రం పర్యాటకులు పరిమిత సంఖ్యలో పాల్గొన్నారు. తాజాగా గోల్డెన్‌ వీక్‌ హాలీడేలో మాత్రం చైనీయులు ఉత్సాహంతో గంతులేశారు. వారం రోజుల్లో చైనా జనాభాలో దాదాపు సగం మంది స్వదేశీ పర్యటనలు చేయడం విశేషం. అంతేకాదు, గత సంవత్సరం మాదిరిగానే విమానాలు, ప్రైవేటు టూర్స్‌, టికెట్ల బుకింగ్స్‌ కూడా 100శాతం జరిగినట్లు అక్కడి పర్యాటక సంస్థలు వెల్లడించాయి. ఇదిలాఉంటే, ఆగస్టు 16నుంచి చైనాలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాకపోవడంతో దేశవ్యాప్తంగా ఆంక్షలను పూర్తిగా సడలించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని