Published : 09 Sep 2021 11:44 IST

Joe Biden: తాలిబన్లతో వేగడం అంత సులభం కాదు

వారితో చైనాకు పెద్ద సమస్యే
పాకిస్థాన్, రష్యా పరిస్థితీ అంతే
అఫ్గాన్‌ పరిణామాలపై బైడెన్‌ సునిశిత వ్యాఖ్యలు 

వాషింగ్టన్‌: రెండు దశాబ్దాల యుద్ధంలో తాలిబన్ల చేతిలో అమెరికా పరాజయం పాలైందని సంతోషపడుతున్న చైనా, పాకిస్థాన్, రష్యాలకు తాలిబన్లు పెనుసవాలుగా మారే అవకాశం ఉందని అమెరికా అభిప్రాయపడుతోంది. తాలిబన్లతో డ్రాగన్‌కు పెద్ద సమస్యే ఉత్పన్నం కానుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ అన్నారు. అఫ్గాన్‌లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిన కొన్ని గంటల తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తాలిబన్లతో వేగడం అంత సులభం కాదన్నారు. ఈ సమస్యను చైనా.. ఇతర దేశాలు ఎలా అధిగమిస్తాయో వేచి చూడాలని తెలిపారు. ‘‘ఒక్క చైనాకే కాదు.. పాకిస్థాన్, ఇరాన్, రష్యాకూ ఇదే సమస్య. దీన్ని వారు ఎలా పరిష్కరిస్తారో వేచి చూడాల్సిందే’’ అని తెలిపారు. తాలిబన్‌ ప్రభుత్వాన్ని గుర్తించడంపై అమెరికా ఆచితూచి స్పందించింది. ఒక్క మహిళకు కూడా ప్రాతినిధ్యం ఇవ్వకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడాన్ని తప్పుపట్టింది. తాము ఉగ్రవాదులుగా పరిగణించిన వ్యక్తులకు ప్రభుత్వంలో చోటు కల్పించడంపై  ఆందోళన వ్యక్తం చేసింది. ‘‘తాలిబన్‌ మాటలను పట్టించుకోం. వారి చేతలను చూసే ఒక అంచనాకు వస్తాం. అఫ్గాన్‌ ప్రజలకు సమ్మిళిత ప్రభుత్వం కావాలి. ఆ విషయాన్ని ఇప్పటికే వారికి స్పష్టం చేశాం’’ అని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి తెలిపారు. జర్మనీ కూడా ఇదే తరహాలో స్పందించింది. ‘‘తాలిబన్‌  ప్రభుత్వంలో అఫ్గాన్‌ సమాజంలోని వివిధ తెగలకు ప్రాతినిధ్యం కల్పించలేదు అంతేకాదు.. కాబుల్‌లో మహిళలు జరిపిన ర్యాలీలోనూ హింస చోటు చేసుకుంది. పరిస్థితులు ఆశావహంగా కనిపించడం లేదు’’ అని జర్మనీ విదేశాంగ మంత్రి హీకో మాస్‌ నిరాశ వ్యక్తం చేశారు.

గుర్తించాల్సింది మేం కాదు.. సభ్యదేశాలే: ఐరాస 

తాలిబన్ల తాత్కాలిక ప్రభుత్వాన్ని గుర్తించే బాధ్యత తమది కాదని ఐక్యరాజ్యసమితి తెలిపింది. దీనిపై సభ్య దేశాలే నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. ‘‘ప్రభుత్వాలకు గుర్తింపునిచ్చే అంశంపై ఐరాస చర్చలు జరపదు. అది సభ్యదేశాలు చేసే పని. అఫ్గాన్‌ పౌరుల హక్కులు, ముఖ్యంగా మహిళలు, యువతుల హక్కులను కాపాడేలా.. శాంతియుతమైన పరిష్కారానికి ఐరాస కట్టుబడి ఉంది. ప్రాణాలు కాపాడేందుకు, మానవతా సహాయం అందించేందుకు సిద్ధంగా ఉంటుంది’’  అని ఐరాస సెక్రటరీ జనరల్‌ ఉప ప్రతినిధి ఫర్హాన్‌ హక్‌ తెలిపారు.

తాలిబన్లకు చైనా రూ.229 కోట్ల సాయం

బీజింగ్‌: తాలిబన్లపై చైనా అపార ప్రేమను చూపిస్తోంది. తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటును స్వాగతించిన డ్రాగన్‌ మరో ముందడుగు వేసింది. రూ. 229 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించింది. ఈ సాయంలో భాగంగా ఆ దేశానికి ఆహార ఉత్పత్తులు, వ్యాక్సిన్లు, ఔషధాలు సరఫరా చేస్తామని పేర్కొంది. బుధవారం అఫ్గానిస్థాన్‌ పొరుగు దేశాల విదేశాంగ మంత్రులతో పాకిస్థాన్‌ ఏర్పాటు చేసిన సమావేశంలో చైనా ఈ మేరకు ప్రకటన చేసింది. ఈ భేటీలో ఇరాన్, తజకిస్థాన్, తుర్కెమెనిస్థాన్, ఉజ్బెకిస్థాన్‌ పాల్గొన్నాయి. రష్యా హాజరుకాలేదు. అంతకుముందు తాలిబన్ల తాత్కాలిక ప్రభుత్వంపై చైనా ప్రశంసల వర్షం కురిపించింది. ప్రభుత్వ ఏర్పాటుతో మూడు వారాలుగా ఆ దేశంలో కొనసాగుతున్న అరాచకానికి తెరపడిందని సంతృప్తి వ్యక్తం చేసింది. దేశీయంగా పరిస్థితులను చక్కదిద్దడానికి, సామాజిక, ఆర్థిక వ్యవస్థను వీలైనంత త్వరగా పునరుద్ధరించడానికి తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేశామని తాలిబన్లు ప్రకటించడాన్ని కూడా చైనా విదేశాంగ ప్రతినిధి వాంగ్‌ వెనెబిన్‌ స్వాగతించారు. మరి తాలిబన్‌ ప్రభుత్వాన్ని గుర్తిస్తున్నారా.. అని విలేకరులు అడిగిన ప్రశ్నకు మాత్రం వాంగ్‌ సమాధానం చెప్పలేదు. 

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని