కరోనా వైరస్‌పై చైనా కొత్తవాదన!

గత సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఈ వైరస్‌ బయటపడిందని, కేవలం చైనా మాత్రమే ఈ విషయాన్ని తొలుత ప్రకటించిందనే కొత్త వాదనను తెరమీదకు తీసుకొచ్చింది.

Published : 10 Oct 2020 02:09 IST

వుహాన్‌తో పాటు చాలా ప్రాంతాల్లో బయటపడిందని వెల్లడి..

బీజింగ్‌: కరోనావైరస్‌ మూలాలపై చైనా కొత్త వాదన మొదలుపెట్టింది. వుహాన్‌ నగరంలో వైరస్‌ బయట పడినట్లు ప్రపంచవ్యాప్తంగా వస్తోన్న ప్రకటనలను తిరస్కరించింది. గత సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఈ వైరస్‌ బయటపడిందని, కేవలం చైనా మాత్రమే ఈ విషయాన్ని తొలుత ప్రకటించిందనే కొత్త వాదనను తెరమీదకు తీసుకొచ్చింది. అయితే, తాజాగా జపాన్‌ వేదికగా జరిగిన QUAD కూటమి చైనా తీరును తప్పుపట్టడంతోపాటు, ప్రపంచవ్యాప్తంగా చైనాపై నమ్మకం తగ్గిపోతోందని వస్తోన్న నివేదికల నేపథ్యంలో వీటిని ఎదుర్కొనేందుకు కొత్త ప్రయత్నాలు మొదలుపెట్టింది.

‘కరోనా వైరస్‌ కొత్త రకమైన వైరస్‌ అని నివేదికలు వెల్లడిస్తున్నాయి. గత సంవత్సరం చివరలో ప్రపంచ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో బయటపడింది. వైరస్‌ వ్యాప్తిపై మొట్టమొదటగా చైనానే నివేదించడంతో పాటు వ్యాధికారకాన్ని గుర్తించి ఆ జన్యుక్రమాన్ని ప్రపంచానికి వెల్లడించాం’ అని చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి హువా చున్‌యింగ్‌ మీడియాతో పేర్కొన్నారు. అయితే, కరోనా వైరస్‌ మూలాలపై ప్రత్యేక బృందం విచారణకు ప్రయత్నాలు జరుగుతోన్న సమయంలో చైనా ఈ ప్రకటన చేసింది. తాజాగా వైరస్‌ మూలాలపై విచారణ చేపట్టేందుకు అంతర్జాతీయ నిపుణుల బృందం పేర్లతో కూడిన జాబితాను WHO చైనాకు పంపింది. ఈ జాబితాను చైనా ఆమోదించాల్సి ఉంది.

దీనితో పాటు టోక్యో వేదికగా జరిగిన భారత్‌, అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా దేశాలతో కూడిన ‘క్వాడ్‌’ కూటమి కూడా కరోనా వైరస్‌పై చైనా వైఖరిని ఎండగట్టాయి. ముఖ్యంగా కరోనా వైరస్‌పై పూర్తి వాస్తవాలను చైనా తొక్కిపట్టిందని అమెరికా మరోసారి ఆరోపించింది. ఆ సమయంలో చైనాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ వంత పాడిందని అమెరికా విదేశాంగశాఖ మంత్రి మైక్‌ పాంపియో క్వాడ్‌ వేదికగా స్పష్టంచేశారు. దీంతో తమపై శక్తిమంతమైన దేశాలు చేస్తోన్న ఆరోపణలను ఎదుర్కొనే ప్రయత్నం చైనా మొదలుపెట్టింది. దీనిలో భాగంగా అసలు వైరస్‌ మూలాలు వుహాన్‌ ల్యాబ్‌లో బయటపడలేదని, చైనాతోపాటు ప్రపంచంలో చాలా ప్రాంతాల్లో ఇది బయటపడిందనే కొత్త వాదనను తెరమీదకు తీసుకువచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని