16వేల ప్రార్థనా మందిరాలను ధ్వంసం చేసిన చైనా!

చైనాలో షిన్‌జియాంగ్‌ ప్రాంతంలో దాదాపు 16వేల ముస్లిం ప్రార్థనా మందిరాలను కూల్చివేసినట్లు ఆస్ట్రేలియా నిపుణుల బృందం బయటపెట్టింది.

Published : 26 Sep 2020 01:17 IST

బయటపెట్టిన ఆస్ట్రేలియా పరిశోధనా బృందం

బీజింగ్‌: చైనాలోని షిన్‌జియాంగ్‌ ప్రాంతంలో మైనారిటీలను నిర్భంధ క్యాంపుల్లో ఉంచుతూ మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతుందనే ఆరోపణలున్న విషయం తెలిసిందే. తాజాగా అక్కడ దాదాపు 16 వేల ముస్లిం ప్రార్థనా మందిరాలను కూల్చివేసినట్లు ఆస్ట్రేలియా నిపుణుల బృందం ఒకటి బయటపెట్టింది.

షిన్‌జియాంగ్‌ ప్రావిన్సులోని వీగర్‌ తెగకు చెందిన ముస్లింలను నిర్భంధిస్తున్నట్లు చైనా ప్రభుత్వంపై ఇప్పటికే ఆరోపణలున్నాయి. అంతేకాకుండా వారి సంప్రదాయల నుంచి దూరం చేయాలనే లక్ష్యంతోనే ఇలా నిర్భంధానికి గురి చేస్తుందనే వాదన కూడా ఉంది. తాజాగా విడుదలైన నివేదిక దీన్ని బలపరుస్తోంది. ముఖ్యంగా షిన్‌జియాంగ్‌ ప్రాంతంలో దాదాపు 16 వేల ముస్లిం ప్రార్థనా మందిరాలను ధ్వంసం చేసినట్లు ఆస్ట్రేలియన్‌ స్ట్రాటెజిక్‌ పాలసీ ఇనిస్టిట్యూట్ ‌(ఏఎస్‌పీఐ) నివేదించింది. శాటిలైట్‌ సాయంతో తీసిన ఫోటోల ఆధారంగా ఏఎస్‌పీఐ దీన్ని నిర్ధారించినట్లు పేర్కొంది. కేవలం గడిచిన మూడు సంవత్సరాల్లోనే దాదాపు 8500 ముస్లిం ప్రార్థనా మందిరాలను కూల్చివేసినట్లు తెలిపింది. అయితే, క్రిష్టియన్‌ చర్చీలు, బౌద్ధ ప్రార్థనా మందిరాలను ధ్వంసం చేసినట్లు ఎలాంటి ఆధారాలూ లేవని తమ పరిశోధనలో తేలినట్లు ఏఎస్‌పీఐ స్పష్టంచేసింది.

వీగర్‌ తెగకు చెందిన మైనారిటీ ముస్లింలను నిర్భంధంలో పెట్టినట్లు వస్తున్న వార్తలను చైనా తొలుత ఖండించినప్పటికీ, తర్వాత అంగీకరించింది. కేవలం వారికి ప్రత్యేక విద్యను అందించేందుకే ఈ చర్యలు తీసుకున్నామని సమర్థించుకుంది. అయితే, దీనిపై అంతర్జాతీయంగా విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా ఇలాంటి బానిస, నిర్భంధ చర్యలను వెంటనే ఆపివేయాలని అమెరికా స్పష్టం చేసింది. అంతేకాకుండా ఆ ప్రాంతంలో తయారయ్యే వస్తువులను అమెరికాలో దిగుమతి చేసుకోకుండా ఆంక్షలు విధించింది. తాజాగా ఆస్ట్రేలియా కూడా ఈ విషయాన్ని తీవ్రంగానే పరిగణిస్తోంది. అయితే, షిన్‌జియాంగ్‌ ప్రాంతంలో మతస్వేచ్ఛకు ఎలాంటి అడ్డంకులూ లేవని చైనా సమర్థించుకోవడం కొసమెరుపు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని