టీకాపై నమ్మకం: తంటాలుపడుతోన్న చైనా!

యావత్‌ ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టిన చైనా ఉత్పత్తులపై ప్రపంచవ్యాప్తంగా నమ్మకం సన్నగిల్లిందన్న వార్తలు వినిపిస్తోన్న సంగతి తెలిసిందే.

Published : 29 Dec 2020 18:10 IST

బీజింగ్‌: యావత్‌ ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టిన చైనా ఉత్పత్తులపై ప్రపంచవ్యాప్తంగా నమ్మకం సన్నగిల్లిందన్న వార్తలు వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఇదే వరుసలో చైనా తయారుచేసిన వ్యాక్సిన్‌లకు కూడా ప్రపంచవ్యాప్తంగా గిరాకీ లేకుండా పోతుందనే వార్తలు ఎక్కువయ్యాయి. పలు వ్యాక్సిన్‌లు ప్రయోగదశల్లో ఉండగానే వివిధ దేశాలు ఒప్పందాలు కుదుర్చుకుంటోన్న వేళ.. చైనా వ్యాక్సిన్‌వైపు మాత్రం చాలా దేశాలు అంతగా ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చైనా తయారుచేసిన వ్యాక్సిన్‌పై నమ్మకాన్ని కలిగించేందుకు డ్రాగన్‌ దేశం తంటాలుపడుతున్నట్లు అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

చైనా తయారుచేసిన కరోనా వ్యాక్సిన్‌ ప్రయోగాలు పలు అభివృద్ధి చెందుతోన్న దేశాల్లో కొనసాగుతున్నాయి. చైనాకు సన్నిహితంగా మెలుగుతోన్న పాకిస్థాన్‌లోనూ చైనాకు చెందిన రెండు వ్యాక్సిన్‌ల క్లినికల్‌ ట్రయల్స్‌ జరుగుతున్నాయి. ఇప్పటికే అక్కడి సీనియర్‌ ప్రభుత్వాధికారులకు కూడా చైనా టీకాలను అందిస్తున్నట్లు సమాచారం. పాకిస్థాన్‌తో పాటు ఇండోనేషియా, బ్రెజిల్‌ దేశాల్లోనూ చైనా వ్యాక్సిన్‌పై ప్రయోగాలు జరుగుతున్నాయి. అయినప్పటికీ ఆయా దేశాల్లో వ్యాక్సిన్‌పై నమ్మకాన్ని సాధించడంలో చైనా విఫలమైనట్లు పలు సర్వేలు, నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇక పాకిస్థాన్‌ ప్రజలు కూడా చైనా వ్యాక్సిన్‌పై అనుమానాలు వ్యక్తం చేస్తుండటం గమనార్హం.

అనుమానాలు వ్యక్తంచేస్తోన్న బ్రెజిల్‌ అధ్యక్షుడు..
చైనా తయారు చేసిన వ్యాక్సిన్‌ ప్రయోగాలను దాదాపు 16దేశాల్లో కొనసాగిస్తోంది. బ్రెజిల్‌, టర్కీ, ఫిలిప్పైన్స్‌, మొరాకో, అర్జెంటీనా, పాకిస్థాన్‌, మెక్సికో, సౌదీ దేశాల్లో ప్రయోగాలు కొనాసాగుతున్నాయి. అయితే బ్రెజిల్‌లో నిర్వహిస్తోన్న ప్రయోగాల్లో చైనా వ్యాక్సిన్‌ కేవలం 50శాతానికిపైగా సమర్థత చూపించిందని బ్రెజిల్ అధికారులు వెల్లడించారు. అయితే, కరోనా వ్యాక్సిన్‌ సమర్థతపై ఇంకా స్పష్టమైన అధికారిక ప్రకటన మాత్రం బయటకు రాలేదు. దీనిపై బ్రెజిల్‌ అధ్యక్షుడు జైర్‌ బోల్సోనారో కూడా బహిరంగంగానే వ్యతిరేకించారు. చైనాలో తయారయ్యే వ్యాక్సిన్‌లపై తనకు నమ్మకం లేదని.. వ్యాక్సిన్‌లను చైనా నుంచి కొనబోమని ఈమధ్యే అక్కడి మీడియాలో స్పష్టంచేశారు. అయితే, బ్రెజిల్‌లో కొన్నిరాష్ట్ర గవర్నర్లు మాత్రం చైనా వ్యాక్సిన్‌పై సానుకూలంగానే ఉన్నారు. తాజాగా బ్రెజిల్‌లో జరిపిన ఓ ప్రైవేటు సర్వేలోనూ చైనా వ్యాక్సిన్‌ను తీసుకోబోమని సర్వేలో పాల్గొన్న సగంమంది అభిప్రాయపడ్డారు. ఇక కెన్యాలో జరిపిన మరో సర్వేలోనూ చైనా, రష్యాలో తయారైన వ్యాక్సిన్‌లపై మెజారిటీ ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. యూకే, అమెరికా వ్యాక్సిన్‌లపైనే వారు మొగ్గుచూపారు. హాంగ్‌కాంగ్‌ ప్రజలు కూడా చైనా వ్యాక్సిన్‌ ఒక్కటే కాకుండా ఫైజర్‌, సినోవాక్‌, ఆస్ట్రాజెనెకాకు చెందిన టీకాల్లో ఇష్టమైన దాన్ని తీసుకోవచ్చని స్థానిక అధికారులు ప్రకటించారు.

పేద దేశాలే దిక్కు..
చైనా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌లను ఇప్పటికే అక్కడ లక్షల మందికి అందిస్తోంది. ఇప్పటివరకు కేవలం చైనా, యూఏఈలలో మాత్రమే చైనా వ్యాక్సిన్‌లను అత్యవసర వినియోగం కింద అందిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఎలాంటి వ్యతిరేకత కనిపించలేదు. కానీ, ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో చైనా ఉత్పత్తులపై నమ్మకం మరింత సన్నగిల్లడంపై ఆ ప్రభావం వ్యాక్సిన్‌లపై కూడా పడినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో చైనాకు కేవలం పేద దేశాల మద్దతు మాత్రమే లభిస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికా, రష్యా, బ్రిటన్‌ తయారుచేసిన వ్యాక్సిన్‌లు ఆఫ్రికా వంటి పేద దేశాలకు అందుబాటులో లేకపోవడంతో చైనా వ్యాక్సిన్‌పైనే ఆధారపడినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. చైనా వ్యాక్సిన్‌ల సమర్థతపై సమాచారం లేకపోవడం కూడా ఇందుకు మరో కారణంగా నిపుణులు భావిస్తున్నారు. వీటికి ముందు కరోనా విజృంభణ ప్రారంభమైన సమయంలోనూ చైనా అభివృద్ధి చేసిన నాణ్యతలేని కరోనా టెస్టు పరికరాలు, పీపీఈ కిట్ల వచ్చిన వార్తలు చైనా ఉత్పత్తులపై అపనమ్మకాన్ని మరింత పెంచినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు.

చైనా లెక్కలు ఏంటంటే..!
చైనా వ్యాక్సిన్‌ను మార్కెటింగ్‌ చేసుకోవడంలో భాగంగా ఆఫ్రికాకు చెందిన దాదాపు 50దేశాల రాయబారులను వ్యాక్సిన్‌ తయారుచేస్తోన్న సినోఫార్మ్‌ కేంద్రానికి చైనా తీసుకెళ్లింది. వ్యాక్సిన్‌ ప్రయోగాలు పూర్తై, సురక్షితమని తేలిన వెంటనే ఆఫ్రికన్‌ దేశాలకు వ్యాక్సిన్‌ అందిస్తామని చైనా విదేశాంగశాఖ ఈమధ్యే వెల్లడించింది. అంతేకాకుండా చాలావరకు అభివృద్ధి చెందుతోన్న దేశాల్లో వ్యాక్సిన్‌ తయారీ లేకపోవడం కలిసివస్తుందని చైనా అధికారులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఫైజర్‌ వంటి వ్యాక్సిన్‌లను నిల్వ చేసుకునే సౌలభ్యం కూడా చాలా దేశాలకు లేదని చైనా భావిస్తోంది. ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో వివిధ సంస్థలు కలిసి ఏర్పడిన కోవాక్స్‌ కూటమీకి వ్యాక్సిన్‌ అందించేందుకు చైనా అంగీకరించింది. దీంతో వ్యాక్సిన్‌ సరఫరాకు ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటామని పేర్కొంటోంది.

ఇదిలాఉంటే, కరోనా వైరస్‌ తొలుత బయటపడిన చైనాలో.. వైరస్‌ వ్యాప్తిని చాలావరకు సాధ్యమైనంత తొందరగానే నియంత్రించగలిగింది. కానీ, కరోనా మూలాలు, హాంగ్‌కాంగ్‌, షిన్‌జియాంగ్‌ వంటి విషయాల్లో అమెరికా, యూకే, ఆస్ట్రేలియా వంటి దేశాలతో కయ్యానికి కాలుదువ్వింది. ఇటు భారత్‌తోనూ ఘర్షణ వాతావరణాన్నే కొనసాగిస్తోంది. దీంతో చాలా దేశాలు చైనా ఉత్పత్తులపై విముఖత చూపిస్తున్నాయి. అదేసమయంలో చైనా ఉత్పత్తులపై ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత పెరిగినట్లు పలు నివేదికలు కూడా వెల్లడించాయి. ఈ నేపథ్యంలో చైనా తయారుచేసిన వ్యాక్సిన్‌పై నమ్మకం కలిగించేందుకు చైనా శతవిధాలా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇవీ చదవండి..
కొవిడ్‌ 19: మిస్టరీ మూలాలపై దర్యాప్తు..!
చైనా వ్యాక్సిన్‌: సమర్థతపైనా గోప్యతే..!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని