భారత్‌కు మేం ముప్పే కాదు: చైనా

భారత్‌కు చైనా నుంచి ఎలాంటి వ్యూహాత్మక ముప్పు లేదని దిల్లీలోని ఆ దేశ రాయబారి సన్‌ వేడాంగ్‌ అభిప్రాయపడ్డారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారియే ఇప్పుడు అన్నింటికంటే పెద్ద ప్రమాదం అని తెలిపారు........

Updated : 31 Jul 2020 11:02 IST

దిల్లీ: భారత్‌కు చైనా నుంచి ఎలాంటి వ్యూహాత్మక ముప్పు లేదని దిల్లీలోని ఆ దేశ రాయబారి సన్‌ వేడాంగ్‌ అభిప్రాయపడ్డారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారియే ఇప్పుడు అన్నింటికంటే పెద్ద ప్రమాదం అని తెలిపారు. భారత్‌తో చైనా ఎప్పుడూ సత్సంబంధాలనే కోరుకుంటోందన్నారు. ఉభయ దేశాల సంబంధాలను మరింత బలోపేతం చేయాలంటే కొన్ని కీలక అంశాల్లో ఇరు పక్షాల మధ్య స్పష్టమైన అవగాహన ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘కొన్ని కీలక అంశాల్లో ఇరు దేశాల మధ్య స్పష్టత ఉండాల్సిన అవసరం ఉంది. శాంతియుత మార్గంలో మేం(చైనా) అభివృద్ధిని కోరుకుంటున్నాం. భారత్‌కు చైనా ఎప్పుడూ వ్యూహాత్మక ముప్పు కాదు. కంటికి కనిపించని వైరసే ఇప్పుడు అతిపెద్ద ప్రమాదం. భారత్‌-చైనా మధ్య ఏళ్లుగా సత్సంబంధాలు కొనసాగిన చరిత్రను విస్మరించడం హానికరం. తాత్కాలిక విభేదాలు, వివాదాలను బూచిగా చూపి వేల సంవత్సరాల సత్సంబంధాల చరిత్రను మరవడం ఏమాత్రం మంచిది కాదు’’ అని వేడాంగ్‌ ట్విటర్‌ వేదికగా అభిప్రాయపడ్డారు. కొవిడ్‌ సంక్షోభం నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సంబంధాలపై గురువారం జరిగిన వెబినార్‌ అనంతరం ఆయన తన అభిప్రాయాల్ని ట్విటర్‌ ద్వారా పంచుకున్నారు. గల్వాన్‌ లోయలో సైనిక ఘర్షణ తర్వాత ఇరు దేశాల మధ్య క్షీణించిన సంబంధాలను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.  

ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థలు ఒకదానికొకటి పెనవేసుకుని ఉన్నాయని వేడాంగ్‌ అభిప్రాయపడ్డారు. బలవంతంగా వ్యాపార బంధాల్ని తుంచేసుకోవడం ఇరు దేశాలకూ ఓటమిగా మిగిలిపోతుందని అభిప్రాయపడ్డారు. ఇటీవల చైనాకు చెందిన పలు యాప్‌లను నిషేధించడంతో పాటు ప్రభుత్వం పలు కాంట్రాక్టులను రద్దు చేసిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఆరోపిస్తున్నట్లుగా చైనాలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలను వేడాంగ్‌ సమర్థించుకునే ప్రయత్నం చేశారు. తైవాన్‌, హాంకాంగ్‌, షింజియాంగ్‌, షీఝాంగ్‌ వంటి వ్యవహారాలు పూర్తిగా చైనా అంతర్గత విషయాలని చెప్పుకొచ్చారు. ఏదేశ అంతర్గత వ్యవహారాల్లో చైనా జోక్యం చేసుకోబోదని.. అలాగే తమ దేశ వ్యవహారాల్లోనూ ఇతరుల జోక్యాన్ని కోరుకోవడం లేదన్నారు.

ఇదీ చదవండి..

ఉపసంహరణ చైనాకు ఇష్టం లేదా?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని