చైనాకు చీవాట్లు..!

ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టిన కరోనా వైరస్‌ వ్యవహారంపై విమర్శలు ఎదుర్కొంటున్న చైనాకు అంతర్జాతీయ వేదికగా మరోసారి చుక్కెదురైంది.

Updated : 27 Sep 2020 15:57 IST

మానవహక్కుల ఉల్లంఘనలపై ప్రపంచదేశాల చురకలు

జెనీవా: ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టిన కరోనా వైరస్‌ వ్యవహారంపై విమర్శలు ఎదుర్కొంటున్న చైనాకు అంతర్జాతీయ వేదికగా మరోసారి చుక్కెదురైంది. హాంగ్‌కాంగ్‌తోపాటు షిన్‌జియాంగ్‌ ప్రాంతాల్లో మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతున్న చైనాపై పాశ్చాత్య దేశాలు విరుచుకుపడ్డాయి. సాధ్యమైనంత త్వరగా ఆయా ప్రాంతాల్లో పౌరుల ప్రాథమిక హక్కులను పునరుద్ధరించాలని చైనాకు చురకలంటించాయి. సెప్టెంబర్‌14 నుంచి అక్టోబర్‌ 7వరకు జరుగుతోన్న ఐరాస మానవ హక్కుల మండలి(UNHRC) సమావేశం దీనికి వేదికైంది. ఈ సందర్భంలో చైనాలో జరుగుతోన్న మానవహక్కుల ఉల్లంఘనలపై వివిధ దేశాలు విరుచుకుపడ్డాయి.

గత కొంతకాలంగా హాంగ్‌కాంగ్‌, షిన్‌జియాంగ్‌ ప్రాంతాల ప్రజలపై చైనా తీవ్ర మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్లు విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాలు బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నాయి. తాజాగా ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి (UNHRC) సమావేశంలో కూడా ప్రపంచ దేశాలు చైనాకు చీవాట్లు పెట్టాయి. హాంగ్‌కాంగ్‌, టిబెట్‌, షిన్‌జియాంగ్‌ ప్రాంతాల్లోని ప్రజలు, జర్నలిస్టులు, లాయర్లతోపాటు విమర్శకులు కూడా తీవ్ర అణచివేతకు గురౌతున్నారని 50మందితో కూడా ఐక్యరాజ్యసమితి నిపుణుల బృందం వెల్లడించింది. ఈ విధంగా హక్కుల పరిరక్షకులను అణచివేయడంతోపాటు ఇంటర్నెట్‌పై ఆంక్షలు, డిజిటల్‌ నిఘావంటి చర్యలకు పాల్పడుతోందని ‘హ్యూమన్‌ రైట్స్‌ వాచ్‌’ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి జాన్‌ ఫిషర్‌ వెల్లడించారు. దాదాపు 60దేశాలనుంచి 300లకుపైగా ఎన్‌జీవోల తరపున జాన్‌ ఫిషర్‌ ఈ సమావేశంలో మాట్లాడారు. ఏ ప్రాంతం కూడా చట్టానికి అతీతం కాదని, ప్రస్తుతం చైనా వంతు వచ్చిందని ఫిషర్‌ అభిప్రాయపడ్డారు.

*షిన్‌జియాంగ్‌లో జరుగుతోన్న అరాచకాలను మారణహోమంగా యూరోపియన్‌ యూనియన్‌ జెవీష్‌ విద్యార్థుల ప్రతినిధి అభివర్ణించారు. నిర్బంధ క్యాంపుల ద్వారా అక్కడి వీగర్‌ తెగకు చెందిన మైనారిటీలను చైనా వేధిస్తోందని ఆరోపించారు.

*హాంగ్‌కాంగ్‌లో వెల్లువెత్తుతున్న నిరసనలను అణచివేసేందుకే కొత్తగా జాతీయ భద్రతా చట్టాన్ని చైనా తీసుకొచ్చిందని బ్రిటన్‌కు చెందిన తరీఖ్‌ అహ్మద్‌ ఆరోపించారు. అంతేకాకుండా నిర్బంధ కుటుంబ నియంత్రణతోపాటు శ్రమ దోపిడికి చైనా పాల్పడుతోందన్నారు.

*మానవహక్కుల కమిషనర్‌తోపాటు స్వతంత్ర దర్యాప్తు బృందాన్ని షిన్‌జియాంగ్‌ ప్రాంతంలో స్వేచ్ఛగా పర్యటించేందుకు అనుమతించాలని ఈయూ తరపున హాజరైన జర్మనీ ప్రతినిధి మైఖేల్‌ ఫ్రేయర్‌ చైనాకు సూచించారు. ముఖ్యంగా షిన్‌జియాంగ్‌లో మత స్వేచ్ఛపై ఉన్న ఆంక్షలు, వీగర్‌ తెగకు చెందిన మైనారిటీ ముస్లింల నిర్బంధ క్యాంపులపై ఈయూ ఆందోళన చెందుతోందన్నారు.

*చిన్నారులను తమ తల్లిదండ్రులకు దూరం చేస్తూ నిర్బంధ క్యాంపుల్లో ఉంచడం భయాందోళనకు గురిచేస్తోందని కెనడా ప్రతినిధి లెస్లీ నార్టన్‌ ఆవేదన వ్యక్తంచేశారు.

ఇదిలాఉంటే, షిన్‌జియాంగ్‌ ప్రాంతంలో దాదాపు 16వేల ముస్లిం ప్రార్థనా మందిరాలను చైనా ధ్వంసం చేసినట్లు ఈమధ్యే ఆస్ట్రేలియన్‌ స్ట్రాటెజిక్‌ పాలసీ ఇనిస్టిట్యూట్ ‌(ఏఎస్‌పీఐ) నివేదిక బయటపెట్టిన విషయం తెలిసిందే.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని