అమెరికాపై చర్యలు తప్పవు..చైనా

టిక్‌టాక్‌, వీచాట్‌ యాప్‌లను నిషేధిస్తున్నట్లు అమెరికా ప్రకటనపై చైనా వాణిజ్యశాఖ స్పందించింది. చైనా కంపెనీలపై చర్యలు తీసుకోవడం ద్వారా అమెరికా బెదిరింపులకు పాల్పడుతోందని ఆరోపించింది.

Published : 19 Sep 2020 12:20 IST

బెదిరింపులకు పాల్పడుతోందని ఆరోపణ

బీజింగ్‌: చైనా తీరుపై ఇప్పటికే గుర్రుగా ఉన్న అమెరికా చర్యలకు ఉపక్రమించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా చైనా యాప్‌లపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. చైనా కంపెనీలపై ట్రంప్‌ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై డ్రాగన్‌ మండిపడుతోంది. తాజాగా టిక్‌టాక్‌, వీచాట్‌ యాప్‌లను నిషేధిస్తున్నట్లు అమెరికా ప్రకటనపై చైనా వాణిజ్యశాఖ స్పందించింది. చైనా సంస్థలపై చర్యలు తీసుకోవడం ద్వారా అమెరికా బెదిరింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించింది.

అయితే, ఇకనైనా ఇలాంటి బెదిరింపులను మానుకోవడంతోపాటు చైనా సంస్థలపై అనైతిక చర్యలను నిలిపివేయాలని అమెరికాకు సూచించింది. అంతర్జాతీయ నియమాలను పాటిస్తూ నైతికత, పారదర్శకతతో కార్యకలాపాలను నిర్వహించాలని విజ్ఞప్తి చేసింది. ఒకవేళ అమెరికా ఇలాగే ఏకపక్ష ధోరణిలో ముందుకెళ్తే మాత్రం దీటుగా స్పందిస్తామని హెచ్చరించింది. చైనా కంపెనీల ప్రయోజనాలను కాపాడటం కోసం అవసరమైన చర్యలకు ఉపక్రమించక తప్పదని చైనా వాణిజ్యశాఖ స్పష్టం చేసింది.

ఇదిలా ఉంటే, వీచాట్‌ యాప్‌పై నిషేధం ఆదివారం నుంచి అమలులోకి రానుండగా, ప్రస్తుతానికి టిక్‌టాక్‌ యాప్‌ అప్‌డేట్‌‌ చేసుకోవడానికి మాత్రం వీలుండదు. టిక్‌టాక్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్న యూజర్లు నవంబర్‌ 12వరకు వినియోగించుకోవచ్చు. ఈలోగా  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ టిక్‌టాప్‌పై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని