చందమామపై చైనా జెండా

జాబిల్లి నుంచి నమూనాలను తెచ్చేందుకు మానవాళి యత్నించడం గత 40ఏళ్లలో ఇదే తొలిసారి. అంతకుముందు అమెరికా చంద్రుడి నమూనాలను తెచ్చేందుకు వ్యోమగాములను పంపింది. 1969లో చేపట్టిన ఆ ప్రయోగంతోనే తొలిసారిగా

Updated : 05 Dec 2020 14:17 IST

అమెరికా తర్వాత 50ఏళ్లకు జాబిల్లిపై మరో పతాకం

బీజింగ్‌: దాదాపు 50ఏళ్ల తర్వాత జాబిల్లిపై మరో దేశ జెండా రెపరెపలాడింది. చంద్రుడి ఉపరితలంపై నమూనాలను సేకరించడానికి వెళ్లిన చైనా వ్యోమనౌక అక్కడ తమ జాతీయజెండాను ఎగురవేసింది. ఇందుకు సంబంధించిన చిత్రాలను చాంగే-5 మానవ రహిత వ్యోమనౌక తన కెమెరాలో బంధించింది. 2 మీటర్ల వెడల్పు, 90 సెంటీమీటర్ల పొడవు ఉన్న ఈ జెండా ఫొటోలను చైనా జాతీయ అంతరిక్ష కేంద్రం విడుదల చేసింది. చంద్రుడి మట్టిని సేకరించి తిరిగి భూమికి బయల్దేరే ముందు చాంగే-5 డ్రాగన్‌ జెండాను జాబిల్లి ఉపరితలంపై పాతింది. 

జాబిల్లి ఉపరితలం నమూనాలను సేకరించి, భూమికి రప్పించేందుకు చైనా గత మంగళవారం సంక్లిష్ట అంతరిక్ష ప్రయోగాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. చాంగే-5 వ్యోమనౌకను విజయవంతంగా కక్ష్యలోకి పంపింది. వెంచాంగ్‌ రోదసి కేంద్రం నుంచి లాంగ్ మార్చ్‌-5 రాకెట్‌ ద్వారా డ్రాగన్‌ ఈ ప్రయోగాన్ని చేపట్టింది. 8 టన్నుల బరువున్న చాంగే-5లో ఆర్బిటర్‌, ల్యాండర్‌, అసెండర్‌, రిటర్నర్‌ అనే నాలుగు స్వతంత్ర భాగాలున్నాయి. ఈ వ్యోమనౌక చంద్రుడి నమూనాలను తీసుకుని గురువారం మధ్యాహ్నం తిరిగి భూమికి బయల్దేరినట్లు చైనా అంతరిక్ష సంస్థ వెల్లడించింది.  

కాగా.. జాబిల్లి నుంచి నమూనాలను తెచ్చేందుకు మానవాళి యత్నించడం గత 40ఏళ్లలో ఇదే తొలిసారి. అంతకుముందు అమెరికా చంద్రుడి నమూనాలను తెచ్చేందుకు వ్యోమగాములను పంపింది. 1969లో చేపట్టిన ఆ ప్రయోగంతోనే తొలిసారిగా మానవుడు చంద్రుడిపై కాలుమోపాడు. జాబిల్లిపై దిగిన నీల్‌ ఆర్మ్‌ స్ట్రాంగ్‌ అమెరికా జెండాను ఎగురవేశారు. ఆ తర్వాత చందమామపై మరో దేశ జెండగా ఎగిరింది ఇప్పుడే కావడం విశేషం. ఇక అమెరికా తర్వాత సోవియట్‌ యూనియన్‌ మాత్రం మానవరహిత వ్యోమనౌకలను ప్రయోగించింది. అమెరికా, సోవియట్‌ యూనియన్‌ పంపిన వ్యోమనౌకలు చంద్రుడిపై శాంపిళ్లను సేకరించి విజయవంతంగా భూమిని చేరుకున్నాయి. ఇప్పుడు చాంగే-5 క్షేమంగా భూమికి తిరిగొస్తే ఈ ఘనత సాధించిన మూడో దేశంగా చైనా నిలుస్తుంది. 

జాబిల్లి నమూనాల సేకరణ ఇలా..

> చంద్రుడి ఉపరితలం నుంచి 200 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలోకి చాంగే-5 చేరింది. ఆ తర్వాత ల్యాండర్‌-అసెండర్‌లు సంయుక్తంగా విడిపోయి.. జాబిల్లి ఉపరితలంపైకి దిగాయి. ఆర్బిటర్‌-రిటర్నర్‌లు కక్ష్యలోనే ఉండిపోయాయి. అవి డాకింగ్‌ కేంద్ర బాధ్యతలను నిర్వహిస్తాయి.

> ల్యాండర్‌-అసెండర్‌లు చంద్రుడి వాయవ్య ప్రాంతంలోని ‘ఓషెనస్‌ ప్రొసెల్లారమ్‌’ అనే ప్రాంతంలో దిగాయి. ల్యాండర్‌లోని రోబో హస్తం.. చంద్రుడి ఉపరితలంపై రెండు మీటర్ల మేర డ్రిల్లింగ్‌ చేపట్టి రెండు కిలోల శిలలు, మట్టి నమూనాలను సేకరించింది. వాటిని అసెండర్‌లోకి చేరవేసింది.  

> అనంతరం అసెండర్‌.. నమూనాలతో సహా నింగిలోకి వెళ్లి కక్ష్యలో ఉన్న ఆర్బిటర్‌-రిటర్నర్‌తో సంధానమైంది. నమూనాలను రిటర్నర్‌లోకి చేరవేసింది.

> చంద్రుడి రాళ్లు, మట్టిని తీసుకొని రిటర్నర్‌ భూమికి బయల్దేరింది. '

ఇవీ చదవండి..

చంద్రధూళికి పగ్గం

సూర్యవలయంలో ఈ వింతను చూశారా?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని