ఈ చైనా వాడు గుండెలు తీసిన బంటు..!

ఇటీవల దిల్లీలో ఐటీ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఓ చైనా జాతీయుడిని అధికారులు ‘తమదైన శైలి’లో ప్రశ్నించే కొద్దీ జాతీయ భద్రతకు సంబంధించిన విషయాలు కూడా బయటపడుతున్నాయి. గత వారం దిల్లీలోని లౌ సాంగ్‌ అలియాస్‌ చార్లీ పెంగ్‌

Published : 16 Aug 2020 20:35 IST

 రూ.1,000 కోట్ల మనీ లాండరింగ్‌
 దలైలామాపై నిఘా..

ఇంటర్నెట్‌డెస్క్‌

ఇటీవల దిల్లీలో ఐటీ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఓ చైనా జాతీయుడిని అధికారులు ‘తమదైన శైలి’లో ప్రశ్నించే కొద్దీ జాతీయ భద్రతకు సంబంధించిన విషయాలు కూడా బయటపడుతున్నాయి. గత వారం దిల్లీలోని లౌ సాంగ్‌ అలియాస్‌ చార్లీ పెంగ్‌ అనే చైనా జాతీయుడిని ఐటీ డిపార్టుమెంట్‌ అరెస్టు చేసింది. అతను తప్పుడు కంపెనీలు, చిరునామాలు, పేర్లతో భారీ ఎత్తున మనీ లాండరింగ్‌కు పాల్పడుతున్నట్లు గుర్తించారు. అతడు మనీలాండరింగ్‌కు పాల్పడ్డ సొమ్ము విలువ రూ.1,000 కోట్లు దాటేసిందని నిర్ధారించారు. తాజాగా అతడు దేశంలో చైనా కోసం రహస్యాలు సేకరిస్తున్నట్లు తేలింది. దీనికోసం లక్షల కొద్దీ లంచాలను ఎరగా వేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. 

2018లోనే అరెస్టు చేసినా..

చార్లీ పెంగ్‌ కదలికలపై 2018లోనే అధికారులకు అనుమానం వచ్చింది. దీంతో అతన్ని అప్పట్లోనే అదుపులోకి తీసుకొన్నారు. కానీ, ఆ తర్వాత బెయిల్‌పై విడుదలయ్యాడు. ఆ తర్వాత టిబెట్‌ ఆధ్యాత్మిక గురువు దలైలామాపై నిఘా వేయడం మొదలుపెట్టాడు. దిల్లీలోని మజ్నూకా తిలు సమీపంలోని టిబెట్‌ శరణార్థి శిబిరాల వద్ద ఉండే టిబెట్‌ వాసులకు రూ.2 లక్షల నుంచి రూ. 3 లక్షల వరకు డబ్బును ఎరవేసి దలైలామాకు సంబంధించిన సమాచారం సేకరించినట్లు గుర్తించారు. 

నేపాల్‌ మార్గంలో భారత్‌లోకి..

చార్లి 2014లో నేపాల్‌ మార్గం ద్వారా భారత్‌లోకి చొరబడ్డాడు. ఆ తర్వాత మిజోరాంకు చెందిన ఓ మహిళను వివాహం చేసుకొన్నాడు. మణిపూర్‌ నుంచి భారత్‌ ఆధార్‌ కార్డు, ఫేక్‌ పాస్‌పోర్టు సంపాదించాడు.  దీంతోపాటు అతనికి చార్లి పెంగ్‌ పేరుతో పాన్‌ కార్డు కూడా ఉంది. ఓ ఛార్టర్డ్‌ అకౌంటెంట్‌ సాయంతో దిల్లీలో మనీలాండరింగ్‌ను ప్రారంభించాడు. దాదాపు 40 బ్యాంక్‌ ఖాతాలను నిర్వహించాడు. వీటి నుంచి రూ.300 కోట్లు విలువైన లావాదేవీలు నిర్వహించాడు. వీటిల్లో చాలా వరకు చైనా సంస్థల కోసం నిర్విహించిన లావాదేవీలే ఉన్నాయి. ఇవన్నీ హాంకాంగ్‌ మార్గంలో చైనాకు చేరాయి. చైనా కంపెనీల పేర్లతో తప్పుడు కొనుగోలు ఆర్డర్లను, బోగస్‌ బిల్లులను సృష్టించినట్లు గుర్తించారు. ఇప్పుడు అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేసే పనిలో ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని