Published : 29 Nov 2020 15:35 IST

చైనా చర్యలు రెచ్చగొట్టేవే..!

సరిహద్దు నిర్మాణాలపై అమెరికా చట్టసభ సభ్యుల ఆందోళన

వాషింగ్టన్‌: భారత సరిహద్దు ప్రాంతమైన లద్దాఖ్‌లో చైనా నిర్మాణాలు చేపడుతున్నట్లు వస్తోన్న వార్తలపై అమెరికా చట్టసభ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవేళ ఆ వార్తలే నిజమైతే, అవి కచ్చితంగా భారత్‌ను రెచ్చగొట్టే చర్యలేనని, దక్షిణ చైనా సముద్రంలో అవలంబిస్తోన్నట్లుగానే ఇక్కడ కూడా చైనా ప్రవర్తిసున్నట్లు వెల్లడించారు. సరిహద్దులో నిర్మాణాలపై శాటిలైట్‌ చిత్రాలు వెలువడ్డ నేపథ్యంలో భారత సంతతికి చెందిన అమెరికా చట్టసభ సభ్యులు చైనా తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు.

‘సరిహద్దు ప్రాంతంలో చైనా నిర్మాణాలు చేపడుతున్నట్లు వస్తోన్న వార్తలు నిజమే అయితే, వాస్తవాలను మారుస్తూ.. చైనా సైన్యం భారత్‌ను రెచ్చగొట్టే మరో చర్యే’ అని డెమొక్రాటిక్‌ సభ్యుడు రాజా కృష్ణమూర్తి మీడియాతో పేర్కొన్నారు. వాస్తవాలను వక్రీకరించే ఉద్దేశంతో దక్షిణ చైనా సముద్రంలోనూ చైనా ఇదే విధమైన నిర్మాణాలు చేపట్టిందని తెలిపారు. ఇంటెలిజెన్స్‌పై అమెరికా చట్టసభ ఏర్పాటు చేసిన శాశ్వత కమిటీలో కీలక సభ్యుడిగా ఉన్న రాజా కృష్ణమూర్తి, చైనా చర్యలపై ఆందోళన వ్యక్తంచేశారు. భారత సంతతికి చెందిన కృష్ణమూర్తి అమెరికాలో జరిగిన తాజా ఎన్నికల్లో ప్రతినిధుల సభకు వరుసగా మూడోసారి ఎన్నికయ్యారు.

భారత్‌కే మద్దతు..

ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ మాదిరిగానే ఎన్నికైన నూతన అధ్యక్షుడి హయాంలోనూ అమెరికా, భారత్‌కే మద్దతుగా ఉంటుందని రాజా కృష్ణమూర్తి స్పష్టంచేశారు. జో జోబైడెన్‌ భారత్‌కు చిరకాల మిత్రుడని, ఉపాధ్యక్షురాలిగా భారత సంతతికి చెందిన కమలా హారిస్‌ కూడా భారత్‌ వెంటే ఉంటారని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా, బైడెన్‌ ప్రభుత్వంలో నూతన విదేశాంగ మంత్రిగా నియమించబడ్డ ఆంటోని బ్లింకెన్‌ భారత్‌కు మంచి స్నేహితుడని, ఆయనకు ఈ ప్రాంత విషయాలపై మంచి పట్టు ఉందని పేర్కొన్నారు. వీరి నేతృత్వంలో భారత్‌తో అమెరికా సంబంధాలు మరింత దృఢ పడతాయనే విశ్వాసాన్ని రాజా కృష్ణమూర్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో చైనాతో సహా ఇలాంటి చర్యలకు పాల్పడే మరే పొరుగు దేశాన్నైనా వ్యతిరేకిస్తామని ఆయన స్పష్టం చేశారు.

తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి భారత్‌, చైనా బలగాల మధ్య గత మే నెలనుంచి ప్రతిష్టంభన నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సరిహద్దు ప్రాంతంలో ఇరుదేశాలు భారీ సంఖ్యలో బలగాలను మోహరించాయి. అయితే, ఇప్పటికే ఇరుదేశాల సైనికాధికారులు వీటిపై పలుసార్లు చర్చలు జరిపినప్పటికీ పరిస్థితులు మాత్రం కొలిక్కిరాలేదు.

ఇదిలా ఉంటే, దాదాపు 13లక్షల చదరపు మైళ్ల విస్తీర్ణంలో ఉన్న దక్షిణ చైనా సముద్ర ప్రాంతాన్ని చైనా తన భూభాగంగానే ప్రకటించుకుంటోంది. అంతేకాకుండా అక్కడ కృత్రిమ ద్వీపాలను సృష్టిస్తూ..మిలటరీ బేస్‌లను కూడా నిర్మిస్తోంది. అయితే, ఇవి తమ భూ భాగాలేనంటూ బ్రూనై, మలేసియా, ఫిలిప్పైన్స్‌, తైవాన్‌, వియత్నాంలు పేర్కొంటున్నాయి. ఇక వియత్నాం, ఫిలిప్పైన్స్‌ దేశాలు చేపట్టే చేపల వేట, ఖనిజాల అన్వేషణ వంటి కార్యకలాపాలను చైనా అడ్డుకుంటోంది. వందల సంవత్సరాలుగా ఈ భూభాగంపై హక్కులు తమవేనని చైనా వాదిస్తోంది.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని