బిడ్డను చూడకుండానే కో పైలట్ మృతి

కొద్ది రోజుల్లో తండ్రిని కాబోతున్నాన్న ఆనందంలో ఉన్నా..విధి నిర్వహణకే ప్రాముఖ్యత ఇచ్చి నిండు గర్భిణి అయిన భార్యను ఇంటి వద్దే వదిలేశాడు.

Published : 09 Aug 2020 00:24 IST

 

 

కొలికోడ్‌: కొద్ది రోజుల్లో తండ్రిని కాబోతున్న ఆనందంలో ఉన్నా..విధి నిర్వహణకే ప్రాముఖ్యత ఇచ్చి నిండు గర్భిణి అయిన భార్యను ఇంటి వద్దే ఉంచి విధులకు బయలుదేరాడు. కరోనా కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను తీసుకువచ్చి, వారిని కుటుంబ సభ్యులతో కలపడమే ముఖ్యమనుకున్నాడు. కానీ, విధి మాత్రం ఆయన మీద అంత జాలి చూపించలేదు. దాంతో తాను ఇష్టంగా చేస్తోన్న ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే  ప్రాణాలు కోల్పోయాడు. అతడే ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ కోపైలట్ అఖిలేశ్‌ శర్మ. 

స్నేహితులు, బంధువులతో అఖిల్ అని ప్రేమగా పిలిపించుకొనే అఖిలేశ్ శర్మకు తల్లిదండ్రులు, భార్య, ఇద్దరు తమ్ముళ్లు, సోదరి ఉన్న అందమైన కుటుంబం ఉంది. కరోనా కారణంగా  లాక్‌డౌన్‌కు ముందు ఒకసారి మాత్రమే కుటుంబాన్ని కలుసుకున్నాడు. ఆయనకు 2017లో వివాహం జరగ్గా..ఇప్పుడు ఆయన భార్య మేఘ నిండు గర్భిణి. మరికొన్ని రోజుల్లో వాళ్లింటికి పండంటి బిడ్డ రాబోతుంది. కానీ, ఇప్పుడు కుటుంబానికి పెద్ద దిక్కు అయిన అఖిలేశ్‌ మాత్రం విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయాడు. అత్యంత బాధాకర విషయం ఏంటంటే  ఇప్పటికీ ఆయన భార్యకు ఈ దుర్వార్తను కుటుంబసభ్యులు తెలియనివ్వలేదట. 

కాగా, కేంద్రం చేపట్టిన వందే భారత్ మిషన్‌లో భాగంగా దుబాయ్‌కు బయలుదేరిన బృందానికి మే 8, 2020న కొలికోడ్‌లోని విమానాశ్రయం వద్ద ఘన స్వాగతం లభించింది. అ బృందంలో అఖిలేశ్ కూడా ఉన్నారు. కానీ సరిగ్గా మూడు నెలల తరవాత ఆగస్టు 7న అదే చోట ఆయన విగతజీవిగా మారడం బాధాకరం. కాగా, ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథుర ఆయన సొంతూరు. 

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని