బైడెన్‌ గెలిచినా మూణ్నాళ్ల ముచ్చటే: ట్రంప్‌

అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అక్కడ రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. అధ్యక్ష పదవికి పోటీపడుతున్న రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి ట్రంప్‌, డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థి బైడెన్‌ మధ్య వాడీవేడి చర్చలో తానే పైచేయి సాధించినట్లు చెప్పుకున్న ట్రంప్‌ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక వేళ రానున్న అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్‌ విజయం సాధించినప్పటికీ...

Updated : 09 Oct 2020 14:54 IST

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అక్కడ రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఈ సమయంలో ట్రంప్‌ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక వేళ రానున్న అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్‌ విజయం సాధించినప్పటికీ ఆ పార్టీ నుంచి ఉపాధ్యక్ష రేసులో ఉన్న కమలా హారిస్‌ రెండు నెలల్లోపే ఆయన పదవిని లాక్కోవడం ఖాయమని వ్యాఖ్యానించారు. కమలా హారిస్‌ను ఓ కమ్యూనిస్టు నేతగా అభివర్ణించారు.

ఉపాధ్యక్ష అభ్యర్థులు మైక్‌ పెన్స్‌, కమలా హారిస్‌ ముఖాముఖి భేటీ జరిగిన సంగతి తెలిసిందే. చర్చలో వీరిద్దరూ హోరాహోరీగా తలపడ్డారు. దీనిపై డొనాల్డ్‌ ట్రంప్‌ స్పందించారు. కరోనా పాజిటివ్‌ తేలడంతో శ్వేతసౌధంలో చికిత్స పొందుతున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వారిద్దరి మధ్య జరిగింది పోటీ కాదని భావిస్తున్నట్లు చెప్పారు. సంప్రదాయాలు మరిచి దిగజారి ప్రవర్తించారని ఆరోపించారు. కమలా హారిస్‌ ఓ కమ్యూనిస్టు.. చాలా భయంకరంగా వ్యవహరించారన్నారు. సెనేటర్‌ బెర్నీని చాలా చులకన చేసి మాట్లాడారని ట్రంప్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె మాటలని బట్టి చూస్తే బైడెన్‌ గెలిచినా అంత ప్రయోజనమేమీ ఉన్నట్లు కనిపించడం లేదన్నారు. రెండు నెలల్లోపే ఆయన పీఠానికి ఎసరు పెట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు.

‘‘ ఒక వేళ ఎన్నికల్లో బైడన్‌ గెలిచినా రెండు నెలలు కూడా అధ్యక్షుడిగా కొనసాగలేరని నా అభిప్రాయం. కమలా హారిస్‌ సోషలిస్టు కాదు. ఆమె ఓ కమ్యూనిస్టు. కావాలంటే ఆమె విధానాలను ఓసారి గమనించండి మీకే అర్థమవుతుంది. గూండాలకు, హంతకులకు స్వాగతం చెప్తూ దేశ సరిహద్దులను తెరావాలని ఆమె చూస్తున్నారు’’ అని తీవ్రంగా విమర్శించారు. బైడెన్‌, హారిస్‌లా రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థులు కూడా అబద్దాలు చెబితే వారిని కూడా మీడియాకు అందనంత ఎత్తుకు తీసుకెళ్తుందని పరోక్షంగా చురకలంటించారు. ఇద్దరు ఉపాధ్యక్ష అభ్యర్థుల మధ్య ముఖాముఖి వారిద్దరి మధ్య జరిగింది కాదని, రెండు పార్టీల విజన్‌ అని ట్రంప్‌ స్పష్టం చేశారు. అధికారంలోకి వస్తే ఏడాది పాటు పన్నుల భారం మోపబోమని చెప్పిన బైడన్‌ వ్యాఖ్యలకు, తాజాగా హారిస్‌ చెప్పిన మాటలకు ఎక్కడా పొంతన లేదని ఆయన విమర్శించారు. ఓ వైపు దేశ సరిహద్దులను తెరుస్తామంటున్నారనీ, మరోవైపు పోలీసు నిధుల్లో కోత పెట్టాలనుకుంటున్నారని విమర్శించారు. వారి మాటలను అమెరికా ప్రజలు వినిపించుకోరనీ, తిరిగి రిపబ్లికన్‌ పార్టీయే అధికారంలోకి వస్తుందని ట్రంప్‌ ధీమా వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు