మా నాన్నను విడిపించండి.. సీజేఐకి లేఖ

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి ప్రదీప్‌ జైన్‌ కుమారుడు గౌరవ్‌ జైన్‌ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బోబ్డేకు లేఖ రాశారు. యూపీ పోలీసులు తన తండ్రిని ఝాన్సీలోని తమ నివాసంలో ఈ నెల 25 నుంచి అక్రమంగా నిర్బంధించారని...........

Published : 28 Dec 2020 23:31 IST

అధికారులకు ఆదేశాలివ్వాలని కోరిన కాంగ్రెస్‌ నేత కొడుకు 

దిల్లీ: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి ప్రదీప్‌ జైన్‌ కుమారుడు గౌరవ్‌ జైన్‌ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బోబ్డేకు లేఖ రాశారు. యూపీ పోలీసులు తన తండ్రిని ఝాన్సీలోని తమ నివాసంలో ఈ నెల 25 నుంచి అక్రమంగా నిర్బంధించారని పేర్కొన్నారు. అసలు నిర్బంధించడానికి కారణాలేమిటో కూడా చెప్పడం లేదన్నారు. జిల్లా పాలనా యంత్రాంగం, వారి రాజకీయ సంబంధాల నేపథ్యంలో తన తండ్రిని లక్ష్యంగా చేసుకున్నారన్న అనుమానం కలుగుతోందని పేర్కొన్నారు. తక్షణమే విడుదల చేసేలా ఆదేశాలు ఇవ్వాలని సీజేఐకి విజ్ఞప్తి చేశారు. 

ఇలాంటి నిర్బంధం పూర్తిగా అక్రమం, చట్టవిరుద్ధమని.. పోలీసుల ఏకపక్ష చర్యలు తన తండ్రి ప్రాథమిక హక్కును ఉల్లంఘించాయన్నారు. అప్రకటిత ఎమర్జెన్సీని తలపించే ఈ పరిస్థితి చాలా దురదృష్టకరమన్నారు. వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించి అక్రమ నిర్బంధాన్ని నిలిపివేసేలా అధికార యంత్రాంగానికి ఆదేశాలివ్వాలని లేఖలో కోరారు. 

మరోవైపు, ప్రదీప్‌ జైన్‌ ఆదిత్యతో పాటు అనేకమంది కాంగ్రెస్‌ పార్టీ నేతలను ఇళ్లల్లోనే పోలీసులు నిర్బంధించినట్టు కాంగ్రెస్‌ ఆరోపించింది. బుందేల్‌ఖండ్‌ ప్రాంతంలోని పలు జిల్లాల్లో గోశాలల దుర్వినియోగాన్ని ఎత్తి చూపేందుకు ‘గోవులను రక్షించండి.. రైతులను పరిరక్షించండి’ పేరుతో ర్యాలీకి ప్రణాళిక రచించినట్టు నేతలు తెలిపారు. ఈ నెల 26 నుంచి 31 వరకు లలిత్‌పూర్‌ నుంచి చిత్రకూట్‌ వరకు తలపెట్టిన తమ మార్చ్‌ను అడ్డుకొనేందుకే అక్రమ నిర్బంధం విధించారన్నారు. అయితే,  శాంతికి విఘాతం కలుగుతుందన్న ఉద్దేశంతో నేతలను ముందస్తుగా అరెస్టు చేసినట్టు చెప్పారు.

ఇదీ చదవండి..

చైనీయులకు నో ఎంట్రీ..మేం చెప్పలేదు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని