రైతులతో 2 అంశాలపై ఏకాభిప్రాయం: తోమర్‌

రైతు సంఘాలతో దిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో కేంద్ర మంత్రుల బృందం చర్చలు ముగిశాయి. దాదాపు ఐదు గంటల పాటు సాగిన సుదీర్ఘ చర్చల్లో వ్యవసాయ చట్టాల రద్దు, కనీస మద్దతు ధర అంశంలో మాత్రం ప్రతిష్టంభన వీడలేదు. .....

Published : 30 Dec 2020 20:09 IST

జనవరి 4న మరో రౌండ్‌ చర్చలు

దిల్లీ: రైతు సంఘాలతో దిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో కేంద్ర మంత్రుల బృందం ఆరో విడత చర్చలు ముగిశాయి. నాలుగు పాయింట్ల అజెండాపై దాదాపు ఐదు గంటల పాటు సాగిన చర్చల్లో రెండు అంశాలపై పరస్పరం ఏకాభిప్రాయం కుదిరినప్పటికీ.. వ్యవసాయచట్టాల రద్దు, కనీస మద్దతు ధర అంశంలో మాత్రం ప్రతిష్టంభన వీడలేదు. దీంతో జనవరి 4న మరోసారి అన్నదాతలతో సమావేశమై అపరిష్కృత అంశాలపై చర్చలు జరపాలని నిర్ణయించినట్టు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ వెల్లడించారు. పర్యావరణ ఆర్డినెన్స్‌, అలాగే, విద్యుత్‌ రాయితీల విషయంలో రైతు సంఘాల నేతల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్నట్టు తెలిపారు. మరోవైపు, మద్దతు ధర విషయంలో రైతుల డిమాండ్ల పరిశీలనకు కమిటీ ఏర్పాటు చేసే యోచనలో కేంద్రం ఉన్నట్టు తెలుస్తోంది. 

చర్చల అనంతరం కేంద్రమంత్రి తోమర్‌ మీడియాతో మాట్లాడుతూ.. దిల్లీలో చలిని దృష్టిలో పెట్టుకొని వృద్ధులు, మహిళలు, చిన్నారులను ఇంటికి పంపాలని రైతు నేతలను కోరినట్టు చెప్పారు. నాలుగు పాయింట్ల అజెండాపై చర్చించగా.. రెండింటిపై ఏకాభిప్రాయం కుదిరిందన్నారు. రైతు సంఘాలు మాత్రం మూడు వ్యవసాయ చట్టాలను రద్దుచేయాలని కోరుతున్నాయన్నారు. కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) కొనసాగుతుందని ప్రభుత్వం చెబుతోందని, ఇందుకోసం లిఖితపూర్వక హామీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు మంత్రి చెప్పారు. అయితే, రైతు నేతలు మాత్రం ఎంఎస్‌పీని చట్టంలో చేర్చాలని పట్టుబడుతున్నారన్నారు.

ఇదీ చదవండి..

రైతులతో కేంద్రం చర్చలు: ప్రతిష్టంభన వీడేనా?

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని