భారీగా తగ్గిన కొవిడ్‌ మరణాలు, కేసులు!

భారత్‌లో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతున్నప్పటికీ రోజువారీ కేసులు, మరణాల సంఖ్య కాస్త తగ్గింది. నిత్యం దేశవ్యాప్తంగా వెయ్యికిపైగా మరణాలు సంభవిస్తుండగా నిన్న ఆ సంఖ్య భారీగా తగ్గింది.

Published : 29 Sep 2020 10:09 IST

24గంటల్లో 70వేల కేసులు, 776 మరణాలు!
83శాతం దాటిన రికవరీ రేటు

దిల్లీ: భారత్‌లో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతున్నప్పటికీ రోజువారీ కేసులు, మరణాల సంఖ్య కాస్త తగ్గింది. నిత్యం దేశవ్యాప్తంగా వెయ్యికిపైగా మరణాలు సంభవిస్తుండగా నిన్న ఆ సంఖ్య భారీగా తగ్గింది. గడిచిన 24గంటల్లో 776 మరణాలు చోటుచేసుకున్నాయి. దీంతో దేశంలో కరోనా మరణాల సంఖ్య 96,318కు చేరింది. అయితే, రోజువారీ మరణాలు 800 దిగువన నమోదుకావడం రెండు నెలల తర్వాత ఇదే మొదటిసారి. ఆగస్టు 4 నుంచి ఇప్పటి వరకూ ఏ ఒక్కరోజు కూడా రోజువారీ మరణాల సంఖ్య ఎనిమిది వందల కంటే తక్కువ నమోదుకాలేదు. ఇక పాజిటివ్‌ కేసుల సంఖ్య కూడా భారీగా తగ్గడం ఊరట కలిగిస్తోంది. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 70,589 కేసులు నమోదయ్యాయి. 70వేల కేసులు నమోదుకావడం గత నెలరోజుల్లో ఇదే తొలిసారి. మంగళవారం నాటికి దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 61,45,291కు చేరినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీరిలో ఇప్పటివరకు 51లక్షల మంది కోలుకున్నారు. నిన్న ఒక్కరోజే మరో 84వేల మంది కోలుకొని డిశ్చార్జి అయినట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం దేశంలో 9లక్షల 47వేల క్రియాశీల కేసులు ఉన్నాయి. దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 83శాతం దాటగా, మరణాల రేటు 1.57శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

దేశవ్యాప్తంగా నిన్న 11,42,811 కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. దీంతో ఇప్పటివరకు 7కోట్ల 31లక్షల టెస్టులు పూర్తిచేసినట్లు ఐసీఎంఆర్‌ వెల్లడించింది. అయితే, వారాంతంలో మాత్రం టెస్టుల సంఖ్య తక్కువగా ఉంటోంది. ఆదివారం కేవలం 7లక్షల పరీక్షలు నిర్వహించారు. అందుకే పాజిటివ్‌ కేసులు తక్కువగా బయటపడినట్లు తెలుస్తోంది. అయితే, మరణాల సంఖ్య తగ్గడం మాత్రం ఊరట కలిగించే విషయం. కేవలం ఒక్క మహారాష్ట్రలోనే నిత్యం దాదాపు 400ల మరణాలు సంభవిస్తున్నాయి. నిన్న ఆ సంఖ్య గణనీయంగా తగ్గింది. గడిచిన 24గంటల్లో అక్కడ 180 మరణాలు నమోదయ్యాయి. ఇప్పటివరకు అక్కడ 35,751 మంది మృత్యువాతపడ్డారు. తమిళనాడులో 9383 మంది ప్రాణాలు కోల్పోగా కర్ణాటకలో 8641 మంది కరోనా రోగులు చనిపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని