భారత్‌లో ఒక్కరోజే 853 మంది మృతి!

భారత్‌లో కరోనా వైరస్‌ మహమ్మారి ఉగ్రరూపాన్ని కొనసాగిస్తోంది. దేశంలో వైరస్‌ సోకి మరణిస్తున్న వారిసంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గత కొన్నిరోజులుగా నిత్యం 700లకు పైగా నమోదవుతున్న మరణాల సంఖ్య, తాజాగా 800 మార్కును దాటింది.

Published : 02 Aug 2020 10:12 IST

17లక్షలు దాటిన కరోనా కేసులు, 37వేల మరణాలు
24 గంటల్లో 51వేల మంది రికవరీ, కొత్తగా 54వేల కేసులు

దిల్లీ: భారత్‌లో కరోనా వైరస్‌ మహమ్మారి ఉగ్రరూపాన్ని కొనసాగిస్తోంది. దేశంలో వైరస్‌ సోకి మరణిస్తున్న వారిసంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గత కొన్నిరోజులుగా నిత్యం 700లకు పైగా నమోదవుతున్న మరణాల సంఖ్య, తాజాగా 800 మార్కును దాటింది. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా రికార్డుస్థాయిలో 853మంది కొవిడ్‌ రోగులు మృత్యువాతపడ్డారు. దీంతో దేశంలో కొవిడ్‌తో మరణించిన వారిసంఖ్య 37,364కు చేరింది. పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24గంటల్లో కొత్తగా 54,735 పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. ఆదివారం నాటికి మొత్తం బాధితుల సంఖ్య 17,50,723కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. వైరస్‌ బాధితుల్లో ఇప్పటికే 11లక్షల 45వేల మంది డిశ్చార్జి అయ్యారు. మరో 5లక్షల 67వేల క్రియాశీల కేసులు ఉన్నాయి.

మహారాష్ట్రలో మృత్యుకేళి..
దేశంలో సంభవిస్తోన్న కరోనా మరణాల్లో అత్యధికంగా మహారాష్ట్ర, తమిళనాడులోనే చోటుచేసుకుంటున్నాయి. మహారాష్ట్రలో వరుసగా రెండోరోజూ రికార్డుస్థాయిలో మరణాలు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే 300 మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు. ముందురోజు కూడా 265 మంది మృతువాతపడ్డారు. దీంతో మహారాష్ట్రలో మొత్తం కొవిడ్‌ మృతుల సంఖ్య 15,300కు చేరింది. తమిళనాడులోనూ నిన్న ఒక్కరోజే దాదాపు 90మరణాలు చోటుచేసుకున్నాయి. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 4000 దాటినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

ఇదిలా ఉంటే, ప్రపంచంలో కరోనా మరణాలు అత్యధికంగా సంభవిస్తోన్న దేశాల జాబితాలో భారత్‌ ఐదో స్థానంలో కొనసాగుతోంది. కరోనా కేసుల్లో మాత్రం మూడో స్థానంలో ఉంది. జాన్స్‌హాప్కిన్స్‌ యూనివర్సిటీ నివేదిక ప్రకారం.. మరణాల సంఖ్య అధికంగా ఉన్న తొలి ఐదు దేశాలు..

దేశం       మరణాల సంఖ్య 
అమెరికా    1,54,361
బ్రెజిల్‌      93,563
మెక్సికో     47,472
బ్రిటన్‌      46,278
భారత్‌      37,364

ఇవీ చదవండి..
గుండె, ఊపిరితిత్తులపై కరోనా దాడి..!
చైనా, రష్యా టీకాలు వద్దు బాబోయ్‌..!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని