రెండో తీవ్రదశకు ఆస్కారం తక్కువే

దేశంలో కొవిడ్‌-19 రెండో తీవ్రదశ (సెకెండ్‌ పీక్‌) ఉండకపోవచ్చని.. ఒకవేళ వచ్చినా తొలిదశ అంత బలంగా ఉండదని ఆరోగ్య నిపుణులు

Published : 20 Dec 2020 13:32 IST

కరోనాపై నిపుణుల అంచనా ఇదే

దిల్లీ: దేశంలో కొవిడ్‌-19 రెండో తీవ్రదశ (సెకెండ్‌ పీక్‌) ఉండకపోవచ్చని.. ఒకవేళ వచ్చినా తొలిదశ అంత బలంగా ఉండదని ఆరోగ్య నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశంలో కొవిడ్‌ కేసుల సంఖ్య కోటి దాటిన నేపథ్యంలో నిపుణులు చెబుతున్న అంశాలు కొంత ఊరటనిస్తున్నాయి. 

అత్యంత తీవ్రదశ ముగిసినట్లే..!

దేశంలో సెప్టెంబరు మధ్యలో రోజుకి దాదాపు 93 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం సగటున ఆ సంఖ్య 25,500కి తగ్గింది. దసరా, దీపావళి పండుగలొచ్చాయి.. ఓ రాష్ట్రంలో ఎన్నికలు కూడా జరిపారు. ఈ నేపథ్యంలో కేసులు పెరగకపోవడంతో ఇక అత్యంత తీవ్రదశ ముగిసినట్లే కనిపిస్తోంది. అధిక జనాభా ఉన్న ప్రాంతాల్లో ప్రజలు రక్షణ పొందడమే కాకుండా వ్యాప్తిని కూడా నిరోధించగలగుతున్నారు. అయితే కొందరు అనూహ్యంగా వైరస్‌ బారిన పడే అవకాశం ఉంటుంది. రోగనిరోధక శక్తి తగ్గితే చిన్నపాటి తీవ్రదశలు రానున్న సంవత్సరాల్లో అప్పుడప్పుడు కనిపించవచ్చు. సమర్థమైన టీకాలు వస్తే ఇక కరోనాను నియంత్రించవచ్చు.- డాక్టర్‌ షాహిద్‌ జమీల్, ప్రఖ్యాత వైరాలజిస్టు 

 ఆందోళన అనవసరం

ఒకప్పుడు ఉన్నంత వేగంగా వైరస్‌ వ్యాప్తి లేకపోవడంతో రెండో తీవ్రదశ ఉండక పోవచ్చు. సామూహిక రోగనిరోధక శక్తి (హెర్డ్‌ ఇమ్యూనిటీ) వచ్చిందని ఇప్పుడే చెప్పలేం. మళ్లీ తీవ్రత వస్తుందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొద్దిస్థాయి రక్షణ లభించిందని భావించొచ్చు. అలాగని సమస్య తొలిగిపోయిందని అనుకోరాదు.- డాక్టర్‌ గగన్‌దీప్‌ కాంగ్, ప్రముఖ క్లినికల్‌ సైంటిస్ట్‌  

రెండో తీవ్రదశకు అవకాశాల్లేవు!

అత్యధిక కొవిడ్‌ కేసులు నమోదైన 15 దేశాలకు గాను.. ఒకటి రెండు దేశాలతో పాటు భారత్‌లోనూ రెండో తీవ్రదశ అవకాశాలు కనిపించడం లేదు. ఒకవేళ వచ్చినా అంత బలంగా ఉండదు. రెండో ఉద్ధృతి (వేవ్‌) కనిపిస్తే వైరస్‌ కొత్త రకంగా ఉండొచ్చు. అంటే కేసులు పెరిగినా మరణాలు తక్కువే ఉంటాయి. సామూహిక రోగనిరోధక శక్తి పెరగడమే అందుకు కారణమవుతుంది.- డాక్టర్‌ కేకే అగర్వాల్, ప్రముఖ హృద్రోగ నిపుణులు  

సమర్థంగా నియంత్రణ..

కొన్ని రాష్ట్రాల్లో కొవిడ్‌ తీవ్రత మలుపు తీసుకున్నా.మరికొన్న చోట్ల హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. చాలా రాష్ట్రాల్లో సమర్థంగా నియంత్రించగలుగుతున్నా, కొన్నిచోట్ల ఇంకా పరిశీలించాల్సి ఉంది. రాష్ట్రాల్లో పరిస్థితులు వేర్వేరుగా ఉన్నాయి. - డాక్టర్‌ సమీరన్‌ పాండా, ఐసీఎంఆర్‌ ఎపిడమాలజీ, అంటువ్యాధుల విభాగం అధిపతి 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని