కరోనా తీవ్రంగా ఉన్న 30 జిల్లాలివే..!

దేశంలో కరోనా వైరస్‌ ఉద్ధృతి తగ్గుతున్నట్టు కనబడుతోంది. గత మూడు నెలల కాలం తర్వాత తొలిసారి మంగళవారం 50వేల కన్నా తక్కువ పాజిటివ్‌ కేసుల.........

Updated : 20 Oct 2020 19:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో కరోనా వైరస్‌ ఉద్ధృతి తగ్గుతున్నట్టు కనబడుతోంది. గత మూడు నెలల కాలం తర్వాత తొలిసారి మంగళవారం 50వేల కన్నా తక్కువ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 10,32,795 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 46,790 కేసులు వచ్చినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ తెలిపింది. అయితే, దేశ వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న యాక్టివ్‌ కేసుల్లో 67శాతం కేవలం ఆరు రాష్ట్రాల్లోనే ఉన్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఆయా రాష్ట్రాల్లో టాప్‌-5 జిల్లాలతో కూడిన జాబితాను విడుదల చేసింది. ఇలా దేశ వ్యాప్తంగా మొత్తం 30 జిల్లాల్లో ఈ వైరస్‌ ఉద్ధృతి అధికంగా ఉన్నట్టు పేర్కొంది. 

ఆ 30 జిల్లాలు ఇవే.. 

మహారాష్ట్రలోని ముంబయి, పుణె, ఠానే, నాగ్‌పూర్‌, అహ్మద్‌నగర్‌; కర్ణాటకలో బెంగళూరు అర్బన్‌, మైసూర్‌, తుమకూరు, దక్షిణ కన్నడ, హసన్‌; కేరళలోని ఎర్నాకుళం, కోలికోడ్‌, తిరువనంతపురం, మళప్పురం, త్రిస్సూర్‌; పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా, 24 ఉత్తర పరగణాస్‌‌, 24 దక్షిణ పరగణాస్‌, హావ్‌డా, హుగ్లీ; తమిళనాడులోని చెన్నై, కోయంబత్తూరు, సేలం, చెంగల్పట్టు, తిరువళ్లూరు; ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి, చిత్తూరు, పశ్చిమగోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో వైరస్‌ వ్యాప్తి అధికంగా ఉన్నట్టు గుర్తించింది.

కోలుకున్నవారిలో మనమే టాప్‌

ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్‌ బారిన పడి కోలుకున్నవారి విషయంలో భారత్‌ అగ్రస్థానంలో ఉంది. దేశంలో 67లక్షల మంది కోలుకొని డిశ్చార్జి అయినట్టు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 9.6 కోట్లకు పైగా శాంపిల్స్‌ పరీక్షించినట్టు ఐసీఎంఆర్‌ అధికారులు వెలల్లడించారు. అలాగే, మరణాల విషయంలోనూ ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్‌లో తక్కువే. ప్రతి మిలియన్‌ జనాభాలో మన దగ్గర 83 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా.. బ్రెజిల్‌లో ఈ సంఖ్య 723గా ఉంది. ఇక స్పెయిన్‌లో 722, అమెరికాలో 657, యూకేలో 642, ఫ్రాన్స్‌లో 508, రష్యాలో 167 మంది చొప్పున ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి మిలియన్‌ జనాభాలో సగటున 147 మంది కొవిడ్‌తో ప్రాణాలు కోల్పోతున్నారు. 

తగ్గుతున్న మరణాల రేటు

మరోవైపు, దేశంలో కొవిడ్‌ బారినపడి కోలుకుంటున్నవారి సంఖ్య రికార్డు స్థాయిలో పెరుగుతోంది. ఇప్పటివరకు దేశంలో 88.63శాతంగా రికవరీ రేటు నమోదైంది. పాజిటివ్‌ కేసుల సంఖ్య కూడా 7.5లక్షల కంటే తక్కువగానే ఉన్నట్టు అధికారులు తెలిపారు. మరణాల రేటు కూడా క్రమంగా తగ్గుతూ వస్తోంది. సెప్టెంబర్‌ 1నాటికి దేశంలో కరోనా మరణాల రేటు 1.77శాతం ఉండగా.. తాజాగా 1.52శాతంగా ఉన్నట్టు గణాంకాలు సూచిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని