దిల్లీలో కరోనా ఉద్ధృతికి కారణం అదే: కేజ్రీవాల్‌

దేశ రాజధాని నగరంలో కరోనా వైరస్‌ ఉద్ధృతి తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతుండటంతో భయాందోళనలు వ్యక్తమవుతున్న వేళ  సీఎం కేజ్రీవాల్‌ స్పందించారు. కరోనా టెస్ట్‌లు పెంచడం ........

Published : 05 Sep 2020 18:39 IST

భయం అవసరం లేదన్న దిల్లీ సీఎం 

దిల్లీ: దేశ రాజధాని నగరంలో కరోనా వైరస్‌ ఉద్ధృతి తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతుండటంపై సీఎం కేజ్రీవాల్‌ స్పందించారు. కరోనా టెస్టులు పెంచడం వల్లే పాజిటివ్‌ కేసులు అధికంగా వస్తున్నాయన్నారు. ప్రజలెవరూ భయపడాల్సిన అవసరం లేదని విజ్ఞప్తి చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కరోనాపై దిల్లీ యుద్ధం ప్రకటించింది. ఇందులో భాగంగా పరీక్షలను రెట్టింపు చేయడం, మార్కెట్లు, బస్టాండ్లు, మొహల్లా క్లీనిక్స్‌ తదితర చోట్ల టెస్టు‌లు ప్రారంభించాం. విస్తృతంగా పరీక్షలు చేసి వైరస్‌ సోకినవారిని ఐసోలేషన్‌ చేసి వారికి మంచి చికిత్స అందిస్తున్నాం. ఈ క్రమంలో కేసులు పెరిగితే భయపడొద్దని అధికారులతో చెప్పా. కరోనాతో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కరోనా మరణాలను తగ్గించేందుకు అనేక చర్యలు తీసుకున్నాం. టెస్టు‌ల సంఖ్యను 20వేల నుంచి 40వేలకు పెంచాం. దిల్లీలోని ఆస్పత్రుల్లో పడకలకు కొరత లేదు. 14వేల పడకలు అందుబాటులో ఉండగా.. వాటిలో 5వేల పడకలు మాత్రమే వినియోగిస్తున్నాం. ఈ 5వేల పడకల్లో కూడా 1700 పడకలు దిల్లీ బయటి నుంచి వచ్చిన రోగులకే ఇచ్చాం’’ అని వివరించారు.  

మరోవైపు, నిన్న ఒక్కరోజే దిల్లీలో 36,219 పరీక్షలు చేయగా 2914 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 69 రోజుల తర్వాత తొలిసారి రికార్డుస్థాయిలో ఇన్ని కేసులు వచ్చాయి. దిల్లీలో ఇప్పటివరకు 17,05,571 శాంపిల్స్‌ను పరీక్షించగా..  1,85,220 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీరిలో 1,61,865 మంది కోలుకోగా.. 4513 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 18,842గా ఉంది. రికవరీ రేటు 87శాతం ఉండా.. మరణాల రేటు 1శాతంగా ఉంది. శుక్రవారం ఒక్కరోజే 1751మంది కోలుకున్నారు. ప్రతి మిలియన్‌ జనాభాకు గాను 89767 మందికి పరీక్షలు చేస్తున్నట్టు దిల్లీ వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌లో వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని