భారత్‌లో కరోనా: 24గంటల్లో 6767 కేసులు

భారత్‌ కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాలుస్తోంది. గత రెండురోజులుగా ప్రతిరోజు దేశవ్యాప్తంగా 6వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24గంటల్లో  అత్యధికంగా 6767పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి.

Updated : 24 May 2020 11:50 IST

దిల్లీ: భారత్‌ కరోనా వైరస్‌ మహమ్మారి ఉగ్రరూపం దాలుస్తోంది. గత మూడురోజులుగా ప్రతిరోజు దేశవ్యాప్తంగా 6వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24గంటల్లో  అత్యధికంగా 6767పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. భారత్‌లో వైరస్‌ బయటపడ్డ తరువాత 24గంటల్లో ఇన్ని కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. దీంతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 1,31,868కి చేరింది. వీరిలో నిన్న ఒక్కరోజే 147మంది మృత్యువాతపడడంతో మొత్తం కొవిడ్‌ సోకి మరణించినవారి సంఖ్య 3867కి చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. వీరిలో ఇప్పటివరకు 54,441మంది కోలుకోగా మరో 73,560మంది చికిత్స పొందుతున్నారని తెలిపింది.

మహారాష్ట్ర, తమిళనాడులలో విశ్వరూపం..
మహారాష్ట్రలో కొవిడ్‌ విశ్వరూపం చూపిస్తూనే ఉంది. ఇక్కడ ప్రతిరోజు కొత్తగా దాదాపు 2వేలకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో 2608పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి.  దీంతో ఆదివారం ఉదయానికి రాష్ట్రంలో కేసుల సంఖ్య 47,190కి చేరగా.. మృతుల సంఖ్య 1577కి చేరింది. వైరస్‌ తీవ్రత అత్యధికంగా కొనసాగుతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర తరువాత తమిళనాడు రెండో స్థానంలోకి ఎగబాకింది. నిన్న ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 759పాజిటివ్‌ కేసులు నమోదుకావడంతో కేసుల సంఖ్య 15,512కి చేరింది. వీరిలో ఇప్పటివరకు 103మంది మరణించగా మరో 7491మంది కోలుకున్నారు.

గుజరాత్‌, దిల్లీలో కొనసాగుతున్న విజృంభణ..
దేశంలో కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్న రాష్ట్రాల్లో గుజరాత్‌ మూడో స్థానంలో ఉంది. కరోనా మరణాల సంఖ్యలో మాత్రం దేశంలోనే రెండో స్థానంలో ఉంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 13,664పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 829మంది మృత్యువాతపడ్డారు. దేశ రాజధాని దిల్లీలోనూ నిన్న ఒక్కరోజే 591పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 12,910కి చేరగా వీరిలో ఇప్పటివరకు 231మంది ప్రాణాలు కోల్పోయారు.

మధ్యప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌లో పెరుగుతున్న మరణాలు..
మధ్యప్రదేశ్‌లో ఇప్పటివరకు 6371పాజిటివ్‌ కేసులు నమోదుకాగా వీరిలో 281మంది మరణించారు. ఇక పశ్చిమబెంగాల్‌లోనూ వైరస్‌ తీవ్రత పెరుగుతోంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 3459కేసులు నిర్ధారణ కాగా 269మంది మృత్యువాతపడ్డారు. దేశంలోనే అధిక జనాభా కలిగిన ఉత్తర్‌ప్రదేశ్‌లో వైరస్‌ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో నుంచి వలసకార్మికులు వారి స్వస్థలాలకు వెళ్తుండడంతో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్లు అక్కడి అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు ఉత్తర్‌ప్రదేశ్‌లో 6017పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 155మంది ప్రాణాలు కోల్పోయారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని