చిన్నారులతోనే కరోనా వ్యాప్తి ఎక్కువ!

ప్రపంచ వ్యాప్తంగా ప్రజలంతా కరోనా వ్యాక్సిన్‌ కోసం ఎదురు చూస్తున్నారు. పలు కంపెనీలు తయారు చేసిన వ్యాక్సిన్లు ప్రయోగ చివరి దశల్లో ఉన్నాయి.మరోవైపు కరోనా ఎలా వ్యాపిస్తోందన్న దానిపై స్పష్టత కొరవడింది. దీనిపై అనేక పరిశోధనలు జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా, చిన్నారుల ద్వారా కరోనా ఎక్కువగా వ్యాపించే అవకాశముందని ఆక్స్‌ఫర్డ్‌ జరిపిన పరిశోధనల్లో...

Published : 06 Oct 2020 17:36 IST

ఆక్స్‌ఫర్డ్‌ పరిశోధనలో వెల్లడి

దిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా ప్రజలంతా కరోనా వ్యాక్సిన్‌ కోసం ఎదురు చూస్తున్నారు. పలు కంపెనీలు తయారు చేసిన వ్యాక్సిన్లు ప్రయోగ చివరి దశల్లో ఉన్నాయి. మరోవైపు కరోనా ఎలా వ్యాపిస్తోందన్న దానిపై స్పష్టత కొరవడింది. దీనిపై అనేక పరిశోధనలు జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా, చిన్నారుల ద్వారా కరోనా ఎక్కువగా వ్యాపించే అవకాశముందని ఆక్స్‌ఫర్డ్‌ జరిపిన పరిశోధనల్లో వెల్లడైంది. అందువల్ల వీలైనంత త్వరగా చిన్నారులపై క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించాల్సిన అవసరముందని అభిప్రాయపడింది. ప్రస్తుతం ఆక్స్‌ఫర్డ్‌ అభివృద్ధి చేస్తున్న ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ మూడో దశ ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇంకా చిన్నారులపై ఈ ప్రయోగాలు చేపట్టాల్సి ఉంది. గతంలో వ్యాక్సిన్‌ ప్రయోగించిన వాలంటీర్లకు అనారోగ్య సమస్యలు తలెత్తడంతో ఆస్ట్రాజెనెకా ప్రయోగాలను తాత్కాలికంగా నిలిపి వేసిన సంగతి తెలిసిందే. కొన్ని రోజుల తర్వాత తిరిగి ప్రయోగాలను కొనసాగించగా... చిన్నారులపై క్లినికల్‌ ట్రయల్స్‌ మాత్రం రెండో దశలోనే ఆగిపోయాయి.

చిన్నారులపై కరోనా వైరస్‌ ప్రభావం ఊహించిన దానికంటే ఎక్కువగానే ఉందని పరిశోధనలో పాల్గొన్న శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. వీరి ద్వారా ఇతరులకు కూడా ఈ మహమ్మారి తొందరగా వ్యాపిస్తోందని పరిశోధనలో తేలిందన్నారు. చిన్నారులపై రెండోదశ  క్లినికల్‌ ట్రయల్స్‌ ఆలస్యమైతే కరోనాను నివారించేందుకు అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ల తయారీ కూడా ఆలస్యమవుతుందని, ఫలితంగా అకడమిక్‌ పరంగా,  మానసికంగా విద్యార్థులు నష్టపోయే అవకాశముందని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. అయితే చిన్నారుల వ్యాధినిరోధక సామార్థ్యాన్ని దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి చేసిన  వ్యాక్సిన్‌ పెద్దలపై అంతగా ప్రభావం చూపలేదని అన్నారు. దీనిని బట్టి చిన్నారులకు, పెద్దలకు ఇచ్చే ఆస్ట్రెజెనెకా వ్యాక్సిన్‌ డోసులో వ్యత్యాసముంటుందనే విషయం స్పష్టమవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని