కరోనా టీకా: ఏయే దేశాలు అనుమతి ఇచ్చాయంటే..!

కరోనా వైరస్‌ను ఎదుర్కొనే వ్యాక్సిన్‌ కోసం యావత్‌ ప్రపంచం ఆశతో ఎదురుచూస్తోన్న విషయం తెలిసిందే.

Published : 24 Dec 2020 01:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా వైరస్‌ను ఎదుర్కొనే వ్యాక్సిన్‌ కోసం యావత్‌ ప్రపంచం ఆశతో ఎదురుచూస్తోన్న విషయం తెలిసిందే. తుది దశ ప్రయోగాల్లో మెరుగైన ఫలితాలను ఇచ్చినట్లు వ్యాక్సిన్‌ తయారీ సంస్థలు వెల్లడించడంతో ప్రపంచ దేశాలు కాస్త ఊపిరిపీల్చుకున్నాయి. ఫైజర్‌, మోడెర్నాలతో పాటు రష్యాకు చెందిన స్పుత్నిక్‌, ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ తయారుచేసిన వ్యాక్సిన్‌ కూడా సమర్థవంతంగానే పనిచేస్తున్నట్లు ప్రకటించాయి. వివిధ దేశాల నియంత్రణ సంస్థలు అత్యవసర వినియోగం కింద వ్యాక్సిన్‌ పంపిణీకి అనుమతులు ఇస్తున్నాయి. దీంతో యుద్ధ ప్రాతిపదికన కొన్ని దేశాల్లో వ్యాక్సిన్‌ పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. ఇప్పటికే కరోనా వ్యాక్సిన్‌ పంపిణీని ప్రారంభించిన కొన్ని దేశాల వివరాలు..

బ్రిటన్‌: కరోనా వైరస్‌ మహమ్మారి ధాటికి అతలాకుతలమైన బ్రిటన్‌లో ఫైజర్‌ వ్యాక్సిన్‌కు డిసెంబర్‌ 3వ తేదీనే అనుమతి ఇచ్చింది. డిసెంబర్‌ 8 నుంచి వ్యాక్సిన్‌ పంపిణీని మొదలుపెట్టిన బ్రిటన్‌.. తొలుత 8లక్షల డోసులను అందించనున్నట్లు పేర్కొంది. ఈ సమయంలో తాజాగా కొత్తరకం వైరస్‌ బయటపడడంతో మరోసారి వ్యాక్సిన్‌ పనితీరుపై అనుమానాలు మొదలయ్యాయి. అయితే, కొత్తరకం వైరస్‌పైనా తమ టీకా సమర్థవంతంగానే పనిచేస్తుందని ఫైజర్‌ సంస్థ ప్రాథమికంగా వెల్లడించింది.

అమెరికా: కరోనా విజృంభణకు వణికిపోతోన్న అమెరికాలో ఇప్పటికే రెండు వ్యాక్సిన్‌లు అందుబాటులోకి వచ్చాయి. అమెరికాలో అత్యవసర వినియోగం కింద తొలి అనుమతి పొందిన సంస్థగా ఫైజర్‌ నిలువగా, అనంతరం మోడెర్నాకు అనుమతి లభించింది. అయితే, మోడెర్నాకు అనుమతిచ్చిన తొలి దేశం మాత్రం అమెరికానే. దీంతో ఇప్పటికే అమెరికాలో దాదాపు 5లక్షల మందికి వ్యాక్సిన్‌ అందించినట్లు సమాచారం. నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌ కూడా వ్యాక్సిన్‌ను బహిరంగంగానే తీసుకున్న విషయం తెలిసిందే.

కెనడా: ఫైజర్‌ వ్యాక్సిన్‌కు అటు కెనడా కూడా అత్యవసర వినియోగానికి డిసెంబర్‌ 9న అనుమతి ఇచ్చింది. డిసెంబర్‌ 14న తొలి డోసు పంపిణీ చేసింది. ఈ నెల చివరినాటికి దాదాపు రెండున్నర లక్షల మందికి వ్యాక్సిన్‌ అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

ఇజ్రాయిల్‌: కరోనా వ్యాక్సిన్‌ను అందించడంలో ఇజ్రాయిల్‌ కూడా ముందుంది. ఈ వారమే అక్కడ వ్యాక్సిన్‌ పంపిణీని చేపట్టారు. జనవరి నాటికి దాదాపు 20లక్షల మందికి వ్యాక్సిన్ అందించడాన్ని అక్కడి అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.

మెక్సికో: ఫైజర్‌ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్‌కు మెక్సికో కూడా అనుమతిచ్చింది. ఈ రోజే అక్కడ వ్యాక్సిన్‌ పంపిణీ ప్రారంభించారు. తొలుత రెండు రాష్ట్రాల్లో దాదాపు లక్షా 25వేల మందికి వ్యాక్సిన్‌ అందిస్తామని మెక్సికో ప్రభుత్వం పేర్కొంది. కేవలం ఫైజర్‌ నుంచే దాదాపు 3కోట్ల డోసులను మెక్సికో ఆర్డర్‌ చేసుకుంది.

బహ్రెయిన్‌: ఫైజర్‌ టీకాకు అనుమతిచ్చిన రెండో దేశంగా బహ్రెయిన్‌ నిలిచింది. డిసెంబర్‌ నాలుగో తేదీనే వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించింది. కరోనా టీకాను తీసుకోదలచుకున్న వారు ముందస్తుగా రిజిస్టర్‌ చేసుకోవాలని అక్కడి పౌరులకు సూచించింది. అనంతరం చైనాకు చెందిన సినోఫార్మ్‌ తయారు చేసిన వ్యాక్సిన్‌కు అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించింది. దీంతో అక్కడ రెండు వ్యాక్సిన్‌లు అందుబాటులోకి వచ్చాయి.

రష్యా: కరోనా వ్యాక్సిన్‌ను తయారుచేసిన తొలి దేశంగా రష్యా ప్రకటించుకున్న విషయం తెలిసిందే. అక్కడి ఆర్‌డీఐఎఫ్‌ తయారుచేసిన స్పుత్నిక్‌ వ్యాక్సిన్‌ దాదాపు 94శాతం సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు తుది దశ ప్రయోగాల విశ్లేషణ అనంతరం వెల్లడించింది. అయితే, ప్రయోగ ఫలితాలు వెల్లడికాకముందే ఆగస్టులోనే వ్యాక్సిన్‌ పంపిణీ చేపట్టింది. ఇప్పటికే దాదాపు లక్ష మందికి టీకా అందించింది. ఈ నెల చివరినాటికి 20లక్షల మందికి టీకా ఇచ్చే ఏర్పాట్లు చేసినట్లు పేర్కొంది. కానీ, రష్యాలో వ్యాక్సిన్‌ పంపిణీపై మిశ్రమ స్పందన వస్తోన్నట్లు తెలుస్తోంది.

చైనా: కరోనా వైరస్‌కు కారణమైన చైనా.. వ్యాక్సిన్‌ తయారీలోనూ ముందుంది. జులై నుంచే అక్కడ అత్యవసర వినియోగం కింద భారీ సంఖ్యలో వ్యాక్సిన్‌ను అందిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ప్రస్తుతం అక్కడ సినోఫార్మ్‌ తయారుచేసిన రెండు వ్యాక్సిన్‌లకు, మరో సంస్థ సినోవాక్‌ బయోటెక్‌ వ్యాక్సిన్‌తో పాటు క్యాన్‌సినో బయోలాజిక్స్‌ తయారు చేసిన వ్యాక్సిన్‌లు అనుమతి పొందాయి. దీంతో చైనాలో నాలుగు వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నాయి. జనవరి చివరి నాటికి అక్కడ దాదాపు 5కోట్ల మందికి వ్యాక్సిన్‌ అందించాలని జిన్‌పింగ్‌ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు చైనా మీడియా తెలిపింది.

స్విట్జెర్లాండ్‌: రెండు నెలల సుదీర్ఘ పరిశీలన తర్వాత ఫైజర్‌ టీకాకు స్టిట్జెర్లాండ్‌ కూడా అనుమతి ఇచ్చింది.

ఈయూ: ఇక కరోనా ధాటికి వణికిపోతోన్న యూరోపియన్‌ యూనియన్‌లో త్వరలోనే వ్యాక్సిన్‌ ప్రక్రియ మొదలు కానుంది. తాజాగా ఫైజర్‌ వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి యూరోపియన్‌ మెడిసిన్స్‌ ఏజెన్సీ(EMA)అనుమతి ఇచ్చింది. దీంతో ఈయూలోని 27 సభ్యదేశాల్లో ఒకేసారి డిసెంబర్‌ 27వ తేదీన వ్యాక్సిన్ పంపిణీని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి.

ఇదిలాఉంటే, భారత్‌లోనూ మరికొన్ని రోజుల్లో వ్యాక్సిన్‌ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. అనుమతి పొందిన ఆరు నెలల్లోనే దాదాపు 30కోట్ల మందికి వ్యాక్సిన్‌ అందించేందుకు భారత ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

ఇవీ చదవండి..
కరోనా.. కొత్త వేషం..!
యూకే రిటర్న్స్‌: భారత్‌లో వారందరినీ ట్రాక్‌ చేస్తాం..!

భారత్‌లో...వచ్చే వారం ఆస్ట్రాజెనెకా టీకాకు అనుమతి?

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని