కొవిడ్‌ టీకా: మరెంతో సమయం లేదు..!

కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ కోసం ప్రపంచంలోని కొన్ని దేశాలు సిద్ధమవుతున్న వేళ.. భారత ప్రధాని మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.

Published : 07 Dec 2020 17:40 IST

అలసత్వం వద్దని హెచ్చరించిన ప్రధాని మోదీ

లఖ్‌నవూ: కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ కోసం ప్రపంచంలోని కొన్ని దేశాలు సిద్ధమవుతున్న వేళ.. భారత ప్రధాని మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌ కూడా వ్యాక్సిన్‌ కోసం ఎంతోసమయం వేచిచూడాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. అయితే, కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవడంలో మాత్రం ఎలాంటి అలసత్వం వహించకూడదని ప్రధాని మోదీ ప్రజలను మరోసారి హెచ్చరించారు. ఆగ్రా మెట్రో ప్రాజెక్ట్‌ను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించిన ప్రధాని.. ప్రసంగం చివరలో కొవిడ్‌ టీకాపై ఈవిధంగా మాట్లాడారు.

‘వ్యాక్సిన్‌ కోసం మనం ఇప్పటివరకు వేచిచూశాం. ఈ మధ్యే నేను శాస్త్రవేత్తలను కూడా కలిశాను, ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌ కోసం దేశం ఎంతో సమయం వేచిచూడాల్సిన అవసరం లేదని అనిపించింది’ అని వెల్లడించారు. అయితే, వైరస్‌ను నిరోధించడంలో ఎలాంటి అలసత్వం వహించవద్దని.. మాస్కులు, రెండు గజాల భౌతిక దూరాన్ని తప్పక పాటించాలని ప్రజలకు మరోసారి ప్రధానమంత్రి సూచించారు.

కరోనా వ్యాక్సిన్‌ పంపిణీకి బ్రిటన్‌, అమెరికా, చైనా, రష్యా దేశాలు సిద్ధమయ్యాయి. చైనా, రష్యా దేశాలు ఇప్పటికే లక్షల మందికి వ్యాక్సిన్‌ను అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. భారత్‌లోనూ వ్యాక్సిన్‌ పంపిణీకి అనుమతివ్వాలంటూ వ్యాక్సిన్‌ కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే వ్యాక్సిన్ అత్యవసర‌ వినియోగానికి అమెరికన్‌ సంస్థ ఫైజర్‌ అనుమతి కోరగా.. తాజాగా సీరం ఇన్‌స్టిట్యూట్‌ కూడా డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా(డీసీజీఐ) అనుమతి కోరింది. యూకే, బ్రెజిల్‌లో జరిపిన ప్రయోగాల్లో ఆక్స్‌ఫర్డ్‌ టీకా 70శాతానికి పైగా సమర్థత కలిగి ఉన్నట్లు వెల్లడైన ఫలితాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించింది. ఆ ఫలితాల ఆధారంగానే భారత్‌లోనూ అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాలని సీరం ఇన్‌స్టిట్యూట్‌ డీసీజీఐకు దరఖాస్తు చేసుకుంది. ఇక ఆక్స్‌ఫర్డ్‌ అభివృద్ధిచేసిన కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ ప్రయోగాలను భారత్‌లో సీరం ఇన్‌స్టిట్యూట్‌ నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌ వచ్చిన తర్వాత తొలిదశలో ఎవరికి అందించాలనే విషయంపై ఇప్పటికే కేంద్రం వ్యూహాలను సిద్ధంచేస్తోంది. వ్యాక్సిన్‌ పంపిణీకి ఎలాంటి అవాంతరాలు లేకుండా అన్ని రాష్ట్రాల సహకారంతో ఏర్పాట్లు చేస్తోంది. తాజా పరిణామాలు చూస్తుంటే, భారత్‌లోనూ తొందరగానే వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

ఇవీ చదవండి..
ఆక్స్‌ఫర్డ్‌ టీకాకు అనుమతి ఇవ్వండి
భారత్‌లో టీకా వినియోగానికి ఫైజర్‌ దరఖాస్తు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని