అతిపెద్ద కొవిడ్ కేర్ సెంటర్‌ మూసివేత!

దేశంలోనే అతి పెద్ద కొవిడ్‌ కేర్ సెంటర్‌గా భావిస్తున్న బెంగళూరులోని కేంద్రాన్ని సెప్టెంబరు 15న మూసివేయనున్నారు.

Published : 08 Sep 2020 01:10 IST

బెంగళూరు: దేశంలోనే అతి పెద్ద కొవిడ్‌ కేర్ సెంటర్‌గా భావిస్తున్న బెంగళూరులోని కేంద్రాన్ని సెప్టెంబరు 15న మూసివేయనున్నారు. లక్షణాలు లేని, స్వల్ప లక్షణాలున్న కరోనావైరస్‌ బాధితులకు చికిత్స అందించడం కోసం ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్ వద్ద బృహత్ బెంగళూరు మహానగర పాలిక(బీబీఎంపీ) దీన్ని ఏర్పాటు చేసింది. కాగా, 10 వేల పడకల సామర్థ్యం ఉన్న ఈ కేంద్రాన్ని మూసివేయనున్నట్లు సెప్టెంబరు 4వ తేదీనాటి ప్రభుత్వ ఉత్తర్వు ద్వారా వెల్లడవుతోంది. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కొవిడ్ కేర్ టాస్క్‌ ఫోర్స్‌ చీఫ్ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీబీఎంపీ వెల్లడించింది. పూర్తిగా లక్షణాలు కనిపించని, స్వల్ప లక్షణాలు ఉన్న వ్యక్తులు హోం ఐసోలేషన్‌లో ఉండటానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో..కొవిడ్ కేంద్రాల్లో చేరే వారి సంఖ్య పడిపోవడమే ఈ నిర్ణయానికి కారణమని అధికారిక వర్గాలు వెల్లడించాయి. 

కాగా, కొవిడ్ కేంద్రాల్లోని పడకలు, ఫ్యాన్లు, డస్ట్‌బిన్లు, తదితరాలను ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే వసతి గృహాలు, ఆసుపత్రులకు ఉచితంగా అందజేయనున్నట్లు తెలిపారు. అయితే, గతంలో ఈ కొవిడ్ సెంటర్‌పై విమర్శలు వచ్చాయి. 
అక్కడ వినియోగించే పడకలు, ఇతర వస్తువులను ఎక్కువ ధరకు అద్దెకు తీసుకోవాలన్న ప్రభుత్వ నిర్ణయంపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. దాంతో అవసరమైన సామాగ్రిని ప్రభుత్వమే కొనుగోలు చేసింది. 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని