రికవరీల్లో రికార్డు: ఒక్కరోజే 73వేల డిశ్చార్జ్‌!

దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు బయటపడుతున్నప్పటికీ కోలుకుంటున్న వారిసంఖ్య భారీగా పెరగడం ఊరట కలిగిస్తోంది.

Published : 06 Sep 2020 12:35 IST

క్రమంగా కోలుకుంటున్న భారత్‌
దేశవ్యాప్తంగా ఇప్పటికే 31లక్షల మంది రికవరీ

దిల్లీ: దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు బయటపడుతున్నప్పటికీ కోలుకుంటున్న వారిసంఖ్య భారీగా పెరగడం ఊరట కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా నిన్న ఒక్కరోజే రికార్డుస్థాయిలో 73వేల మంది వైరస్‌ నుంచి కోలుకొని డిశ్చార్జి అయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటి వరకు 31 లక్షల 80వేల మంది వైరస్‌ నుంచి కోలుకున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా బాధితుల రికవరీ రేటు 77.32శాతంగా ఉంది. మరో 20.96శాతం యాక్టివ్‌ కేసులు ఉండగా, కరోనా మరణాల రేటు 1.72శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

ప్రభుత్వం టెస్టుల సంఖ్యను పెంచుతూ రోగులను ముందస్తుగానే గుర్తించడం వల్ల రికవరీ సంఖ్య పెరుగుతున్నట్లు ఆరోగ్యశాఖ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా గడిచిన పదిరోజులుగా రోజువారీగా కోలుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఆగస్టు 23వ తేదీన రికవరీ సంఖ్య 57వేలు ఉండగా సెప్టెంబర్‌ 5వ తేదీ నాటికి ఆ సంఖ్య 70వేలకు చేరింది. ఇక నిన్న ఒక్కరోజే రికార్డుస్థాయిలో 73వేల మంది కరోనా బాధితులు కోలుకున్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా రోజువారీ రికవరీలు పెరుగుతున్న తీరు...

దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ  వైరస్‌ నుంచి కోలుకుంటున్న వారిసంఖ్య క్రమంగా పెరుగుతుండడం ఊరట కలిగిస్తోంది. మే చివరి వారంలో వైరస్‌ నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 50వేలు ఉండగా, ప్రస్తుతం అది 31లక్షలు దాటింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న ఆరోగ్య సంరక్షణ చర్యల ఫలితంగా వైరస్‌ నుంచి తొందరగా బయటపడుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించడంతోపాటు రోగులకు మెరుగైన చికిత్స అందించడం ద్వారా రోగులు త్వరగా కోలుకుంటున్నారనే అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. కరోనా పోరులో భారత్‌ విజయం సాధిస్తుందనడంలో రికవరీ సంఖ్యనే ఉదహరణ అని స్పష్టంచేస్తున్నారు. ఇక దేశవ్యాప్తంగా కరోనా బాధితుల రికవరీ సంఖ్య పెరుగుతున్న తీరు ఇలా..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని