భారత్‌లో ఆక్స్‌ఫర్డ్‌ టీకా ట్రయల్స్‌కు అనుమతి

ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం తయారుచేస్తున్న కరోనా వ్యాక్సిన్‌ రెండు, మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించేందుకు సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌ఐఐ)కు డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా(డీసీజీఐ) అనుమతిచ్చింది..........

Updated : 03 Aug 2020 10:35 IST

రెండు, మూడో దశ ప్రయోగాలు జరపనున్న సీరం ఇన్‌స్టిట్యూట్‌

నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు డీసీజీఐ అంగీకారం

దిల్లీ: ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం తయారుచేస్తున్న కరోనా వ్యాక్సిన్‌ రెండు, మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించేందుకు సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌ఐఐ)కు డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా(డీసీజీఐ) అనుమతిచ్చింది. కొవిడ్‌-19పై అధ్యయనం చేస్తున్న నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు ట్రయల్స్‌కు అంగీరిస్తూ డీసీజీఐ వి.జి.సొమానీ ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎస్‌ఐఐ వెల్లడించింది. ఆక్స్‌ఫర్డ్‌ జరిపిన తొలి, రెండో దశ ఫలితాలను విశ్లేషించిన అనంతరం భారత్‌లో దీన్ని పరీక్షించేందుకు అనుమతించాలని ‘సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్’‌(సీడీఎస్‌సీవో)లోని నిపుణుల కమిటీ డీసీజీఐకి సిఫార్సు చేసింది. దీంతో ‘కొవిషీల్డ్‌’ పేరిట తయారు చేస్తున్న ఈ వ్యాక్సిన్‌ను భారత్‌లో ప్రయోగించేందుకు అనుమతి లభించింది. దేశవ్యాప్తంగా మొత్తం 17 ప్రాంతాల్లో ఈ ప్రయోగాలు జరగనున్నట్లు సీఐఐ వర్గాలు తెలిపాయి. వీటిలో విశాఖలోని ఆంధ్ర మెడికల్‌ కాలేజ్‌ కూడా ఉంది. 18 ఏళ్ల వయసు పైబడిన 1600 మందికి ఈ వ్యాక్సిన్‌ ఇవ్వనున్నట్లు సమాచారం.  

మూడో దశకు చేరే ముందు ఈ డ్రగ్ భద్రతకు సంబంధించి ‘డేటా సేఫ్టీ మానిటరింగ్‌ బోర్డ్‌’(డీఎస్‌ఎంబీ) సమీక్షించిన సమాచారాన్ని సీడీఎస్‌సీవోకు సమర్పించనున్నారు. ఈ వ్యాక్సిన్‌ను మొత్తం రెండు డోసుల్లో ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. తొలి డోసు ఇచ్చిన 29 రోజుల తర్వాత రెండో డోసు ఇవ్వనున్నారు. తద్వారా వివిధ దశల్లో వ్యాక్సిన్ భద్రత, శరీరంలో వ్యాధి నిరోధక శక్తి స్పందన తెలుస్తుందని వివరించారు. ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌కు సంబంధించి ప్రస్తుతం బ్రిటన్‌లో రెండు, మూడో దశ.. బ్రెజిల్‌లో మూడో దశ, దక్షిణాఫ్రికాలో ఒకటి, రెండో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ కొనసాగుతున్నాయి.

ఇదీ చదవండి..

వారంలోనే మూడున్న‌ర ల‌క్ష‌ల కేసులు నమోదు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని