ఆ విమానాశ్రయానికి ఏడాది ముందే నోటీసులు!

కేరళలోని కోలికోడ్‌ విమానాశ్రయంలో జరిగిన విమాన ప్రమాదానికి సంబంధించి కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయయి. విమానాశ్రయానికి సంబంధించి ముందు నుంచే కొన్ని భద్రతా పరమైన లోపాలు ఉన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు విమానయాన...

Updated : 08 Aug 2020 15:35 IST

కోలికోడ్‌: కేరళలోని కోలికోడ్‌ విమానాశ్రయంలో జరిగిన విమాన ప్రమాదానికి సంబంధించి కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయయి. విమానాశ్రయానికి సంబంధించి ముందు నుంచే కొన్ని భద్రతా పరమైన లోపాలు ఉన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ గతేడాది ఎయిర్‌పోర్ట్‌ డైరెక్టర్‌కు నోటీసులు జారీ చేసింది. రన్‌వే, విమానాలు నిలిపే స్థలం (అప్రాన్‌)లో లోపాలు ఉన్న విషయాన్ని ఆ నోటీసుల్లో లేవనెత్తింది.

గతేడాది జులై 2న ఇదే విమానాశ్రయంలో ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ విమానం ల్యాండింగ్‌ సమయంలో వెనుకభాగం దెబ్బతింది. ఈ ఘటనపై డీజీసీఏ అధికారులు విచారణ జరిపి, కొన్ని భద్రతా పరమైన లోపాలను కనుగొన్నారు. ఈ మేరకు కోలికోడ్‌ ఎయిర్‌పోర్ట్‌ డైరెక్టర్‌ కె.శ్రీనివాసరావుకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసినట్లు డీజీసీఏ అధికారులు వెల్లడించారు. రన్‌వేపై పగుళ్లు ఉన్నాయని, అక్కడక్కడా నీరు నిలిచిపోతోందని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. రబ్బరు ముక్కలు కూడా అధికంగా ఉన్నాయని గుర్తించినట్లు పేర్కొన్నారు.

2010లో మంగళూరు విమానాశ్రయంలో ఇదే తరహా ప్రమాదం జరిగి మంటలు రావడంతో ఎక్కువమంది ప్రాణాలు కోల్పోయారు. అనంతరం కొద్దిరోజులకే ఇలాంటి తరహా ఘటనలు కోలికోడ్‌లోనూ జరిగే అవకాశం ఉందని డీజీసీఏ వర్గాలు గతంలోనే హెచ్చరించారు. రన్‌వేకు ఆవల 240 మీటర్ల బఫర్‌ ఏరియా అవసరం అని అప్పటి ముఖ్యమంత్రి ఊమెన్‌ చాందీకి దృష్టికి డీజీసీఏ, ఎయిరిండియా తీసుకెళ్లాయి. డీజీసీఏ అభ్యంతరాలు లేవనెత్తినట్లే శుక్రవారం ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ విమానం ల్యాండింగ్‌ సమయంలో అదుపు తప్పి లోయలో పడింది. ఈ ఘటనపై ఇప్పటికే డీజీసీఏ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని