కవ్వింపు వైఖరిని చైనా విడనాడాలి

ఉద్రిక్త పరిస్థితిని చక్కదిద్దేందుకు దౌత్య స్థాయిలో కృషిచేయాలని అమెరికా కాంగ్రెస్‌ సభ్యుడు రాజా కృష్ణమూర్తి చైనాకు హితవు పలికారు.

Published : 18 Sep 2020 19:16 IST

అమెరికన్‌ కాంగ్రెస్‌ సభ్యుడు రాజా కృష్ణమూర్తి

వాషింగ్టన్‌: భారత్ సైన్యాన్ని రెచ్చగొట్టే వైఖరిని విడనాడాలని.. లద్దాఖ్‌ ప్రాంతం వద్ద ఉద్రిక్త పరిస్థితిని చక్కదిద్దేందుకు దౌత్య స్థాయిలో కృషి చేయాలని అమెరికా కాంగ్రెస్‌ సభ్యుడు రాజా కృష్ణమూర్తి చైనాకు హితవు పలికారు. ఈయన 2017 నుంచి డెమోక్రటిక్‌ పార్టీ తరపున అమెరికా హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌లో ఇల్లినాయిస్‌ రాష్ట ప్రతినిధిగా ఉన్నారు. అంతేకాకుండా ప్రతిష్టాత్మక ‘హౌస్‌ పర్మినెంట్‌ సెలక్ట్‌ కమిటీ ఆన్‌ ఇంటెలిజెన్స్‌’లో ఆయన ఏకైక భారతీయ అమెరికన్‌ సభ్యులు.

భారత్‌-చైనా ఉద్రిక్తతలను గురించి చర్చించేందుకు ఈ కమిటీ తొలిసారిగా సమావేశమైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘‘భారత్‌, చైనా సరిహద్దుల వద్ద ఘర్షణలు తీవ్ర విచారకరం. ఈ నేపథ్యంలో భారత సైన్యంపై కవ్వింపు చర్యలకు చైనా స్వస్తి పలకాలని కోరుతూ నేను రూపొందించిన ద్వైపాక్షిక తీర్మానానికి సభ ఆమోదం లభించింది. ఈ వివాదానికి పూర్తి పరిష్కారం లభించే వరకు ఈ అంశాన్ని నేను క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంటాను.’’ అని రాజా కృష్ణమూర్తి తెలిపారు.

ప్రస్తుతం సరిహద్దుల వద్ద ప్రతిష్టంభన కొనసాగుతున్న నేపథ్యంలో యథాతథ స్థితిని ఏకపక్షంగా మార్చాలనే ప్రయత్నానికి పాల్పడొద్దంటూ భారత్‌, చైనాను గురువారం హెచ్చరించిన సంగతి తెలిసిందే. కాగా, ఈ వ్యవహారంలో భారత్‌ అవలంబిస్తున్న దృఢ, బాధ్యతాయుత వైఖరికి అమెరికా తన మద్దతు ప్రకటించింది. భారత్‌ ఒకవైపు దౌత్య విధానం ద్వారా సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తూనే.. తన సైనిక, ఆర్థిక పరమైన స్థిరత్వాన్ని కనబరిచిందని అమెరికా ప్రశంసించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని