తయారీ పరిశ్రమలను అనుమతించం: కేజ్రీవాల్‌

దేశరాజధానిలో కాలుష్యాన్ని అరికట్టేందుకు ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకనుంచి పారిశ్రామిక ప్రాంతాల్లో కొత్తగా ఏర్పాటయ్యే తయారీ కర్మాగారాలను అనుమతించేది లేదని స్పష్టం చేశారు.

Published : 02 Nov 2020 21:45 IST

దిల్లీ:  దేశరాజధానిలో కాలుష్యాన్ని అరికట్టేందుకు ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకనుంచి పారిశ్రామిక ప్రాంతాల్లో కొత్తగా ఏర్పాటయ్యే తయారీ కర్మాగారాలను అనుమతించేది లేదని స్పష్టం చేశారు. కేవలం సేవలకు సంబంధించిన కంపెనీలు మాత్రమే అనుమతించబడతాయని వెల్లడించారు. ఈ మేరకు సోమవారం ఓ సమావేశంలో వెల్లడించారు. కేజ్రీవాల్‌ మాట్లాడుతూ.. ‘దిల్లీలోని పారిశ్రామిక ప్రాంతాల్లో నూతన తయారీ పరిశ్రమలను అనుమతించేది లేదు. దిల్లీ ఆర్థికవ్యవస్థ తయారీ పరిశ్రమల మీద కాకుండా.. సేవల మీద ఆధారపడి నడుస్తోంది. ఈ కొత్త నిబంధన ఐటీ, మీడియా, కాల్‌సెంటర్‌, హెచ్‌ఆర్‌ సర్వీస్‌, బీపీవో వంటి పలు రంగాలకు ప్రయోజనాల్ని కలిగిస్తుంది’అని పేర్కొన్నారు. 

‘రాజధానిలో అధిక వాణిజ్య ధరల కారణంగా గతంలో పలు సేవల సంబంధిత కార్యాలయాలు.. గురుగ్రామ్‌, నోయిడా, ఫరీదాబాద్‌కు వెళ్లాల్సివచ్చింది. ఇప్పుడు ఈ నిబంధన కారణంగా వారంతా అతి తక్కువ ధరల్లో దిల్లీలోని పారిశ్రామిక ప్రాంతాల్లోకి రావచ్చు. ఇంతటితో దిల్లీలో పరిశ్రమల కారణంగా వెలువడుతున్న కాలుష్యం ఆగిపోతుంది. మన పారిశ్రామిక ప్రాంతాలు పచ్చగా, పరిశుభ్రంగా మారుతాయి’అని కేజ్రీవాల్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. 

ఇప్పటికే జాతీయ హరిత ట్రిబ్యునల్‌ దిల్లీలో పారిశ్రామిక కార్యకలాపాలపై నిషేధం విధించడంతో గత కొన్నేళ్లుగా పెద్ద కంపెనీలు తమ ప్లాంట్లను నగరం వెలుపలకు బదిలీ చేశాయి. అయినప్పటికీ దిల్లీలో ప్రస్తుతం 3వేలకు పైగా కంపెనీలు నడుస్తున్నాయి. దీంతో ప్రతి ఏటా శీతాకాలంలో దిల్లీపై మంచు దుప్పటి కమ్మేస్తోంది. అందులోనూ ఈ ఏడాది కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో కాలుష్య సమస్య ఆందోళనకరంగా మారింది. కాలుష్యం ప్రభావంతో కరోనా కేసుల్లో పెరుగుదల కనిపించే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts