దిల్లీలో ప్రతి ఇంట్లో కరోనా..

దేశ రాజధానిలో నెలకొన్న కరోనా వైరస్‌ పరిస్థితి పట్ల దిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

Published : 12 Nov 2020 12:09 IST

అలా ఎందుకు చేశారు.. ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న

దిల్లీ: దేశ రాజధానిలో నెలకొన్న కరోనా వైరస్‌ వ్యాప్తిపై దిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇక్కడ ఏ ఒక్క ఇల్లూ కొవిడ్‌ నుంచి తప్పించుకోలేకపోయిందని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఇటువంటి పరిస్థితుల్లో కట్టడి నిబంధనలను ఎందుకు సడలించారంటూ హైకోర్టు ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. దిల్లీలో ప్రబలుతున్న కొవిడ్‌-19 కేసులకు అనుగుణంగా నిర్ధారణ పరీక్షల సంఖ్యను పెంచాల్సిందిగా హైకోర్టులో ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం నమోదైంది. అంతేకాకుండా ఫలితాల వెల్లడిని కూడా వేగవంతం చేయాలంటూ పిటిషన్‌లో అభ్యర్థించారు. కాగా, ఈ కేసును న్యాయమూర్తులు హిమా కోహ్లీ, సుబ్రమణియం ప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం విచారణకు స్వీకరించింది.

నివ్వెరపరచే గణాంకాలు

ఈ నేపథ్యంలో దేశ రాజధానిలో నిర్వహిస్తున్న సీరో సర్వే నాలుగో రౌండుకు సంబంధించిన నివేదిక న్యాయస్థానం పరిశీలించింది. ఈ సర్వేని అక్టోబర్‌ 15, 21ల మధ్య 15,015 మందిపై నిర్వహించారు. సెప్టెంబరుతో పోలిస్తే కరోనా కేసుల పెరుగుదల రేటు రెట్టింపు కన్నా ఎక్కువగా ఉన్నట్టు ఈ దీనిలో వెల్లడైంది. అంతేకాకుండా దిల్లీలో ప్రతి నలుగురిలో ఒకరిలో కరోనా వైరస్‌ యాంటీబాడీస్‌ ఉన్నట్టు తెలిపింది. యాంటీబాడీల ఉనికి పురుషుల్లో (25.06 శాతం) కంటే మహిళల్లో (26.1 ఈ శాతం) స్వల్పంగా అధికమని తెలిసింది. ఈ శాతం 50 ఏళ్లు పైబడిన వారిలో అత్యధికంగా 29.83గా ఉన్నట్టు నివేదిక పేర్కొంది.

దిల్లీలో కొవిడ్ కేసులు ఇంకా పతాక స్థాయికి చేరనేలేదని.. మహమ్మారి వ్యాప్తి ఇంకా కొనసాగుతుందని సర్వే ఫలితాలు స్పష్టం చేసాయి. అంతేకాకుండా డయాబెటిస్ (షుగర్‌ వ్యాధి) కొవిడ్‌కు దారితీసే ముఖ్య కారకమని నాలుగో రౌండు సీరో సర్వేలో  తెలిసింది.
ఈ వివరాలను పరిశీలించిన దిల్లీ న్యాయస్థానం దిల్లీ‌ సర్కారు వైఖరిని తప్పుపట్టింది. గణాంకాలు పరిస్థితిని స్పష్టం చేస్తున్నప్పటికీ కొవిడ్‌ నిబంధనలను ఎందుకు సడలించాల్సి వచ్చిందంటూ ప్రశ్నించింది. మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాలు ఆచితూచి వ్యవహరిస్తుండగా తీవ్ర ప్రభావమున్న దిల్లీ ప్రభుత్వ ఉదాసీన వైఖరిని న్యాయస్థానం తప్పుపట్టింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని