రానున్న రోజుల్లో దిల్లీకి ప్రమాదమే..!

రానున్న రోజుల్లో దేశ రాజధాని దిల్లీలో ప్రతిరోజు 15వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు జాతీయ వ్యాధుల నియంత్రణ మండలి (ఎన్‌సీడీసీ) రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది...

Published : 10 Oct 2020 00:52 IST

రోజూ 15 వేల కేసులు నమోదయ్యే అవకాశం

దిల్లీ: రానున్న రోజుల్లో దేశ రాజధాని దిల్లీలో రోజూ 15వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు జాతీయ వ్యాధుల నియంత్రణ మండలి (ఎన్‌సీడీసీ) రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. రాబోయే పండగలు, శీతాకాలంలో అత్యధిక కేసులు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు వెల్లడించింది. ఇందుకు మూడు కారణాలను పేర్కొంది. 1) పలు పండగల నేపథ్యంలో ఇతర ప్రాంతాల వారు దిల్లీకి చేరుకోవడంతో వారికి వ్యాధి సోకడం. 2) శీతాకాలంలో ఎదురయ్యే శ్వాసకోశ సంబంధిత రోగాలు తీవ్రతరం కావడం, పరీక్షలు నిర్వహించుకోవడంతో వారిలో వ్యాధి నిర్ధరణ కావడం. 3) వ్యాధి తీవ్రంగా ఉన్న రోగులు రాజధానికి చేరుకోవడవం. వీటితో పాటు పలు కార్యక్రమాలకు ఒకచోట చేరడంతో కొవిడ్‌ కేసులు విపరీతంగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపింది. నీతి ఆయోగ్‌ ఆరోగ్య విభాగ ఛైర్మన్‌ డా.వీకే పాల్‌ పర్యవేక్షణలో ఎన్‌సీడీసీ బృందం ఈ నివేదిక రూపొందించింది.

దిల్లీలో రోజూ 15 వేల కరోనా కేసులు నమోదయ్యే సూచనలు ఉన్నాయని, అందులో 20 శాతం మందికి వ్యాధి తీవ్రరూపం దాల్చే అవకాశం ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. ఆ 20 శాతం రోగులను చేర్చుకోవడానికి ప్రభుత్వం ఆసుపత్రుల్లో తగిన ఏర్పాట్లు చేసుకోవాలని పేర్కొంది. రాజధానిలోని అనేక మంది వైద్యులు, సిబ్బంది మహమ్మారి బారిన పడ్డారని, వారికి వ్యాధి సోకకుండా ఆసుపత్రుల్లో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. పరిశుభ్రత, మాస్కులు ధరించడం, భౌతిక దూరంపై మరింత దృష్టిపెట్టాలని తెలిపింది. పండగలను తక్కువ మందితో నిర్వహించుకోవాలని, బహిరంగ ప్రదేశాల్లో గుమిగూడటాన్ని అరికట్టేలా ప్రభుత్వం ప్రజలకు అవగాహన కల్పించాలని నివేదిక సూచించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని