నెలలో 2300 మరణాలు.. దిల్లీకి ఏమైంది?

దేశ రాజధాని నగరంలో కరోనా వైరస్‌ కల్లోలం సృష్టిస్తోంది. నవంబర్‌ మాసం పూర్తికాకముందే ఒక్క నెలలో దిల్లీలో 2వేల మందికి పైగా మృత్యువాతపడ్డారు. అక్టోబర్‌ 28 నుంచి ఇప్పటివరకు 2364 మంది కొవిడ్‌తో ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు...........

Published : 26 Nov 2020 17:12 IST

దిల్లీ: దేశ రాజధాని నగరంలో కరోనా వైరస్‌ కల్లోలం సృష్టిస్తోంది. నవంబర్‌ మాసం పూర్తికాకముందే దిల్లీలో 2వేల మందికి పైగా మృత్యువాతపడ్డారు. అక్టోబర్‌ 28 నుంచి ఇప్పటివరకు 2364 మంది కొవిడ్‌తో ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు వెల్లడించారు. చలి కాలానికి తోడు పండుగ సీజన్‌ తోడవ్వడంతో అక్టోబర్‌ చివరి వారం నుంచి దిల్లీలో కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం ఒక్క రోజే రాజధానిలో 99 మరణాలు నమోదు కావడంతో మొత్తం కొవిడ్‌ మృతుల సంఖ్య 8720కి చేరింది. 

దిల్లీలో కేసులు, మరణాలు ఇలా..

దిల్లీ నగరంలో నవంబర్‌ 19న 98 మరణాలు నమోదు కాగా.. 20న 118, 21న 111, 22న, 23 తేదీల్లో 121 చొప్పున, నవంబర్‌ 24న 109చొప్పున మరణాలు నమోదైనట్టు అధికారిక గణాంకాలు పేర్కొంటున్నాయి. నవంబర్‌ 18న అత్యధికంగా 131 మరణాలు నమోదు కాగా.. నవంబర్‌ 11న అత్యధికంగా 8593 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇక గత వారం నుంచి నమోదైన కేసులను పరిశీలిస్తే.. గురువారం 7546 కొత్త కేసులు నమోదు కాగా.. శుక్రవారం 6608, శనివారం 5879, ఆదివారం 6746, సోమవారం 4454, మంగళవారం 6224, బుధవారం 5246 చొప్పున కేసులు నమోదయ్యాయి. దిల్లీలో ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్‌కేసుల సంఖ్య 5,45,787కు చేరుకుంది. వీరిలో 8720మంది ప్రాణాలు కోల్పోగా.. 4,98,780 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 38,287 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 

నిపుణులేమంటున్నారు?
కరోనా సోకిన తర్వాత ఆస్పత్రుల్లో ఆలస్యంగా చేరడం వల్ల రోగుల పరిస్థితి ఆందోళనకరంగా మారుతోందని వైద్యరంగ నిపుణులు పేర్కొంటున్నారు. దీనికి తోడు దిల్లీలో ఐసీయూ పడకల కొరత, ప్రతికూల వాతావరణం, కాలుష్యం పెరగడం వల్ల దిల్లీలో మరణాలు సంఖ్య అధికంగా ఉంటుందోని చెబుతున్నారు. రాజధాని నగగరంలో వైరస్‌ సంక్రమణ పెరుగుతండటంతో మరణాలను ఆడిట్‌చేయాలని, కొవిడ్‌ మరణాలను తగ్గించేందుకు తగిన సూచనలు చేయాలని దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ బుదవారం నిపుణులకు విజ్ఞప్తి చేశారు. 

మరణాలపై హైకోర్టు ఆందోళన
 దేశ రాజధానిలో నవంబర్‌ నెలలో 2వేలకు పైగా మరణాలు నమోదవడంపై దిల్లీ హైకోర్టు ఆందోళన వ్యక్తంచేసింది. చాలా మంది ప్రాణాలు కోల్పోయిన తర్వాత ప్రభుత్వం ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షల సంఖ్యను పెంచిందని ఆక్షేపించింది. దిల్లీలో కొవిడ్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నవారి నుంచి వసూలు చేస్తున్న డబ్బుతో ఏం చేస్తున్నారని అడిగింది. ఆ డబ్బును మంచి కారణం కోసం వినియోగించాలని సూచించింది. నిబంధనలు ఉల్లంఘించిన వారి నుంచి జరిమానా వసూళ్లకు నగదు చెల్లింపులు చేయొద్దని, దీని కోసం ప్రత్యేకంగా ఓ పోర్టల్‌ ఏర్పాటు చేసి దాని ద్వారా నగదు రహిత చెల్లింపులను ఆన్‌లైన్‌ ద్వారా స్వీకరించాలని దిల్లీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. 

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని