Coronavirus: కొవిడ్‌కు ‘విశ్వాస’ పరీక్ష! 

విశ్వాసానికి మారుపేరైన శునకాలు.. వాసన చూసి నిందితులు, ఆయుధాలు, బాంబుల జాడను

Published : 31 May 2021 12:34 IST

సుశిక్షిత శునకాలతో వైరస్‌ను పసిగట్టొచ్చు

లండన్‌: విశ్వాసానికి మారుపేరైన శునకాలు.. వాసన చూసి నిందితులు, ఆయుధాలు, బాంబుల జాడను పసిగట్టడంతో సాయం చేస్తున్నాయి. అలాగే కొవిడ్‌-19 బాధితులనూ ఇవి గుర్తించగలవని బ్రిటన్‌ శాస్త్రవేత్తలు తేల్చారు. కరోనా సోకిన వ్యక్తుల నుంచి ఒకరకం వాసన వస్తుందని, దాన్ని అత్యంత కచ్చితత్వంతో ఈ శునకాలు పట్టుకోగలవని వారు పేర్కొన్నారు. లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ హైజీన్‌ అండ్‌ ట్రాపికల్‌ మెడిసిన్‌ (ఎల్‌ఎస్‌హెచ్‌టీఎం) శాస్త్రవేత్తలు.. మెడికల్‌ డిటెక్షన్‌ డాగ్స్‌ అనే స్వచ్ఛంద సంస్థ, దర్హామ్‌ విశ్వవిద్యాలయంతో కలిసి ఈ పరిశోధనను నిర్వహించారు. కొవిడ్‌ నిర్ధారణలో శునకాల సామర్థ్యంపై జరిగిన అత్యంత సవివర పరిశోధన ఇదేనని వారు తెలిపారు. పరిశోధనలో భాగంగా కొవిడ్‌ బాధితుల మాస్కులు, సాక్స్, టి-షర్టుల సాయంతో వారి శరీర వాసనలపై కొన్ని శునకాలకు శిక్షణ ఇచ్చారు. కొవిడ్‌ నెగిటివ్‌గా తేలిన వారి నుంచి సేకరించిన నమూనాలపైనా తర్ఫీదు ఇచ్చారు. ఈ శిక్షణ కొన్ని వారాల పాటు సాగింది. అనంతరం ఈ జాగిలాలు చాలా వేగంగా కొవిడ్‌ జాడను పట్టేశాయని శాస్త్రవేత్తలు తేల్చారు. ఈ విషయంలో అవి 94.3 శాతం సున్నితత్వాన్ని, 92 శాతం నిర్దిష్టతను ప్రదర్శించాయని వారు పేర్కొన్నారు. వ్యాధి లక్షణాలు లేని కొవిడ్‌ బాధితులనూ ఇవి గుర్తించగలవని తెలిపారు. రెండు భిన్న రకాల కరోనా వైరస్‌ బారినపడివారిని, అధిక, తక్కువ వైరల్‌ లోడు కలిగిన వారినీ పసిగట్టేస్తాయని చెప్పారు. ల్యాబ్‌ పరిస్థితుల్లో చూపిన సత్తాను ఇవి వాస్తవ ప్రపంచంలోనూ చాటగలవా అన్నదానిపై మరింత పరిశోధన అవసరమని పేర్కొన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని