రైతులకు తీరని అన్యాయం చేస్తున్నారు: సోనియా

నూతన వ్యవసాయ చట్టాలను గురించి కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Published : 02 Oct 2020 13:29 IST

దిల్లీ: ఇటీవల అమలులోకి వచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వీటిని చట్టబద్ధం చేయడం ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోని రైతులకు తీరని అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. నేడు మహాత్మా గాంధీ, దివంగత ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రిల జన్మదినం సందర్భంగా సోనియా ఇరువురు నేతలకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన వీడియో ప్రకటనలో.. భారతదేశ ఆత్మ పల్లెల్లోనే ఉంటుందని అందుకే లాల్‌ బహదూర్‌ శాస్త్రి ‘జై జవాన్‌, జై కిసాన్‌’ అని నినదించారని ఆమె గుర్తుచేశారు.

భూసేకరణ చట్టాల మాదిరిగానే ఈ క్రూర చట్టాలు కూడా నిర్వీర్యమయ్యే దాకా తాము రైతుల పక్షాన నిలిచి పోరాడతామని సోనియా స్పష్టంచేశారు. కరోనా వైరస్‌ లాక్‌డౌన్‌ కాలంలో పేదలకు నిత్యావసరాలు సరఫరా చేయగలగటం రైతుల చలవే అని.. అయితే ప్రస్తుత ప్రభుత్వం బడా బాబులకు కొమ్ము కాస్తూ, రైతులను వారి పొలాల్లోనే కూలీలను చేసేందుకు కంకణం కట్టుకుందని ఆమె మండిపడ్డారు. కాగా, నూతన వ్యవసాయ చట్టాలపై కాంగ్రెస్‌ పార్టీ నేడు దేశవ్యాప్త నిరసన కార్యక్రమాలను చేపట్టింది. రాహుల్‌ గాంధీ ఆధ్వర్యంలో పంజాబ్‌లో అక్టోబర్‌ 3 నుంచి 5 వరకు ట్రాక్టర్‌ ప్రదర్శనలను నిర్వహించనున్నట్టు పార్టీ అధికార ప్రతినిధి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని