‘కోలుకుంటున్నాం కదా అని తేలిగ్గా తీసుకోవద్దు’

కొవిడ్‌ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య దేశంలో క్రమంగా పెరుగుతోందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ తెలిపారు. అయినా, మహమ్మారిని అంత తేలిగ్గా తీసుకోవద్దని హెచ్చరించారు............

Updated : 29 Feb 2024 18:45 IST

కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ హెచ్చరిక

ఇండోర్‌: కొవిడ్‌ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య దేశంలో క్రమంగా పెరుగుతోందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ తెలిపారు. అయినా, మహమ్మారిని అంత తేలిగ్గా తీసుకోవద్దని హెచ్చరించారు. శుక్రవారం మధ్యప్రదేశ్‌లో ఓ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 76.28 శాతానికి పెరిగిందన్నారు. మరణాల రేటు 1.82 శాతంగా ఉందని.. ప్రపంచంలోనే ఇది అత్యల్పమని తెలిపారు. ఇప్పటి వరకు దాదాపు నాలుగు కోట్ల నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించారు. ఒక్క గురువారం రోజే తొమ్మిది లక్షల పరీక్షలు చేసినట్లు పేర్కొన్నారు. మిగతా దేశాలతో పోలిస్తే మహమ్మారిని ఎదుర్కోవడానికి భారత్‌ వద్ద మెరుగైన ప్రణాళికలు, సన్నద్ధత ఉందని తెలిపారు. అయినా.. కరోనా వైరస్‌ను నిర్లక్ష్యం చేయడం తగదని సూచించారు.

ప్రజలకు కరోనా వైరస్‌ వ్యాప్తి గురించి అవగాహన కల్పించి అప్రమత్తంగా ఉంచాల్సిన బాధ్యత స్థానిక నాయకులపైనే ఉందని హర్షవర్ధన్‌ గుర్తుచేశారు. అందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే... వీలైనంత త్వరగా కరోనాపై విజయం సాధించాలన్న ప్రధాని మోదీ కల సాకారామవుతుందన్నారు. దేశవ్యాప్తంగా 75 సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు నెలకొల్పాలన్న లక్ష్యం దిశగా చర్యలు వేగవంతంగా కొనసాగుతున్నాయన్నారు.    

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ప్రకటించిన విధంగా నేషనల్‌ డిజిటల్‌ హెల్త్‌ మిషన్‌ ప్రారంభమైందని మంత్రి హర్షవర్ధన్‌ తెలిపారు. ప్రస్తుతం ఆరు కేంద్ర పాలిత ప్రాంతాల్లో అమలవుతోందన్నారు. మరో మూడు నెలల్లో దేశవ్యాప్తంగా ప్రారంభిస్తామన్నారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వాలు సన్నద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని