అయోధ్యలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు

రామమందిరం భూమిపూజను పురస్కరించుకొని ఉత్తరప్రదేశ్‌ పోలీసులు అయోధ్యలో భారీ భద్రతా చర్యలు..

Published : 02 Aug 2020 17:54 IST

వీఐపీల రూట్లను డ్రోన్‌లతో పరిశీలన

అయోధ్య: రామమందిరం భూమిపూజను పురస్కరించుకొని ఉత్తరప్రదేశ్‌ పోలీసులు అయోధ్యలో భారీ భద్రతా చర్యలు చేపడుతున్నారు. ఆగస్టు 5వ తేదీన ప్రధాని మోదీ రామమందిరం భూమిపూజలో పాల్గొననున్న నేపథ్యంలో నగరంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఓ సీనియర్‌ పోలీసు అధికారి తెలిపారు. ఈ కార్యక్రమానికి పలువురు ముఖ్యమంత్రులు, అనేకమంది ప్రముఖులు సైతం హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలోనే భూమిపూజకు ముందు రెండు రోజులు, ఆ రోజు అయోధ్యలో చేపట్టబోయే భద్రతా చర్యలపై నగర రేంజ్‌ డీఐజీ దీపక్‌కుమార్‌ మాట్లాడారు. ‘ప్రోటోకాల్‌ను అనుసరించి ప్రధాని పర్యటనలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నాం. కొవిడ్‌-19 ప్రోటోకాల్‌ను సైతం పాటిస్తున్నాం. కరోనా వారియర్లను కూడా అందుబాటులో ఉంచనున్నాం’ అని న్యూస్‌ ఏజెన్సీ పీటీఐకి తెలిపారు. ‘వీఐపీలు వచ్చే రూట్లను డ్రోన్ల సహాయంతో నిరంతరం పర్యవేక్షిస్తాం. పట్టణంలోని ప్రజలకు ఎలాంటి పరిమితులు విధించలేదు. కరోనాను దృష్టిలో ఉంచుకొని బయటకు రావద్దని నగర ప్రజలను కోరుతున్నా. ఇతర వ్యక్తులను పట్టణంలోనికి అనుమతించం’ అని డీఐజీ పేర్కొన్నారు.

ఐదుగురి కంటే ఎక్కువమంది ఒకచోట గుమిగూడకుండా ఉండేలా చర్యలు చేపడుతున్నట్లు మరో పోలీసు అధికారి వెల్లడించారు. కరోనా పరీక్షల్లో నెగెటివ్‌ వచ్చిన, 45 సంవత్సరాల కంటే తక్కువ వయసున్నవారిని మాత్రమే ప్రధానికి సెక్యూరిటీగా ఉంచనున్నట్లు ఆయన తెలిపారు. ట్రాఫిక్‌ సమస్య లేకుండా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఏర్పాటు చేసిన శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఈ వేడుకను నిర్వహిస్తోంది. భూమిపూజ కార్యక్రమం అనంతరం రామమందిరం నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. 
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని