80శాతం కేసులు లక్షణాలు లేకుండానే!: ఉద్ధవ్‌

మహారాష్ట్రలో నమోదవుతున్న కరోనా వైరస్‌ కేసుల్లో దాదాపు 80శాతం లక్షణాలు లేకుండానే నిర్ధారణ అవుతున్నాయని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే వెల్లడించారు.

Published : 26 Apr 2020 16:42 IST

ముంబయి: మహారాష్ట్రలో నమోదవుతున్న కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల్లో 80శాతం లక్షణాలు లేకుండానే నిర్ధారణ అవుతున్నాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే వెల్లడించారు. మిగతా 20శాతం బాధితుల్లో కొందరిలో స్వల్ప లక్షణాలు కనిపిస్తుండగా మరికొందరిలోనే తీవ్రంగా ఉన్నట్లు గుర్తించామన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో లక్షణాలు కనిపించిన వెంటనే సొంత వైద్యం చేసుకోకుండా ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని ప్రజలకు సూచించారు. లాక్‌డౌన్‌ను సడలిస్తే ముంబయి నగరంలో ట్రాఫిక్‌ రద్దీ పెరిగే అవకాశం ఉంటుందని, ఈ సందర్భంలో కొవిడ్-19పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాల్సి ఉందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ను ఎత్తివేయడం ఎంతో సున్నితత్వంతో కూడుకున్నదని..రానున్న మూడు, నాలుగు నెలలు ఎంతో కీలకమని వ్యాఖ్యానించారు. అయితే అత్యవసర సర్వీసులైన వైద్యులు తమ క్లినిక్‌లను నడుపుకోవడంతో పాటు డయాలసిస్‌ సెంటర్ల కూడా ప్రారంభించవచ్చని సూచించారు. ఇలాంటి క్లిష్ట సమయంలో నగరంలో రైలు సర్వీసులను నడపడం అసాధ్యమని స్పష్టం చేశారు. అలాంటి చర్యలు చేపడితే మాత్రం కరోనా తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. వీటన్నింటిపై ఈనెల చివరినాటికి ఓ నిర్ణయానికి వస్తామని ఉద్ధవ్‌ ఠాక్రే పేర్కొన్నారు.

రాష్ట్రంలో మరణాల రేటు 4.23శాతం..

మహారాష్ట్రలో కరోనా వైరస్‌తో మృతిచెందుతున్న వారిసంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే ఇక్కడ 323మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో మరణాల రేటు 4.23గా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఇది దేశంలో కొవిడ్‌తో మరణిస్తోన్న వారికంటే (జాతీయ సగటు 3.11) ఎక్కువ కావడం కలవరపెడుతోంది. రాష్ట్రంలో ఆదివారం నాటికి 7628 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా మొత్తం బాధితుల్లో 1076 మంది కోలుకున్నారు.

ఇవీ చదవండి..

భారత్‌లో ఒక్కరోజే 1990 కేసులు

మే 3 తర్వాత స్వదేశానికి భారతీయులు?

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు