11 రాష్ట్రాల ఉప ఎన్నికల ఫలితాలు ఇలా..!

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలతోపాటే దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో 59 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం, 59 స్థానాల్లో దాదాపు 40చోట్ల భాజపా విజయం సాధించింది.

Published : 11 Nov 2020 01:57 IST

దిల్లీ: బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలతోపాటే దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో 59 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇప్పటికే చాలా ఫలితాలు వెల్లడికాగా మరికొన్నిచోట్ల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం, 59 స్థానాల్లో దాదాపు 40చోట్ల భాజపా విజయం సాధించింది. కాంగ్రెస్‌ మాత్రం కేవలం పన్నెండు స్థానాల్లోనే ఆధిక్యత కనబరిచింది. మరో ఏడు స్థానాల్లో ఇతర పార్టీలు/ఇండిపెండెంట్‌ అభ్యర్థులు విజయం సాధించారు. అత్యధికంగా మధ్యప్రదేశ్‌లో 28 అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికల్లో 17చోట్ల భాజపా విజయం సాధించగా మరో రెండు స్థానాల్లో గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. ఇక గుజరాత్‌లోనూ జరిగిన 8 స్థానాలను భాజపా క్లీన్‌స్వీప్‌ చేసింది. మరో కీలక రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లోనూ ఆరు స్థానాల్లో భాజపా విజయ దుందుభి మోగించింది. మరో స్థానంలో సమాజ్‌వాది పార్టీ అభ్యర్థి గెలుపొందారు. ఇక్కడ ఉన్నావ్‌ జిల్లాలోని బంగేర్‌మౌ నియోజకవర్గంలోనూ భాజపా అత్యధిక మెజారిటీ సాధించింది. అంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్న భాజపా నేత కుల్‌దీప్‌ సింగ్‌ అత్యాచారం కేసులో జైలుశిక్ష అనుభవిస్తోన్న విషయం తెలిసిందే. ఆ స్థానాన్ని మళ్లీ భాజపానే కైవసం చేసుకుంది. 

11 రాష్ట్రాల్లో ఉప ఎన్నికల ఫలితాలు ఇలా ఉన్నాయి..

* ఛత్తీస్‌గఢ్‌లో ఒకస్థానానికి ఉపఎన్నిక జరగ్గా కాంగ్రెస్‌ విజయం సాధించింది. ఇక్కడ కాంగ్రెస్‌కు 56శాతం ఓట్లు పోలవ్వగా రెండోస్థానంలో ఉన్న భాజపాకు 36శాతం ఓట్లు పోలయ్యాయి.

* గుజరాత్‌లో ఎనిమిది స్థానాల్లో భాజపా అన్నిచోట్లా విజయం సాధించింది. ఇక్కడ కూడా రెండు పార్టీల మధ్య దాదాపు 20శాతం ఓట్ల తేడా ఉంది. భాజపాకు 55శాతం ఓట్లు రాగా కాంగ్రెస్‌కు 34శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి.

* హరియాణాలో ఒక స్థానానికి ఎన్నిక జరగ్గా .. ఇక్కడ కాంగ్రెస్‌ విజయం సాధించింది. భాజపా అభ్యర్థిపై దాదాపు పదివేల మెజార్టీతో కాంగ్రెస్‌ అభ్యర్థి గెలుపొందారు.

* ఝార్ఖండ్‌లో రెండు స్థానాలకు ఉపఎన్నికలు జరగ్గా కాంగ్రెస్‌ ఒక స్థానంలో, జేఎంఎం మరోస్థానంలో గెలుపొందాయి.

* కర్ణాటకలో రెండు స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. రెండింటిలో భాజపా విజయం సాధించింది.

* మధ్యప్రదేశ్‌లో 28స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. వీటిలో భాజపా ఇప్పటికే 17చోట్ల విజయం సాధించగా మరో రెండు చోట్ల ఆధిక్యంలో ఉంది. మరో ఏడు స్థానాల్లో కాంగ్రెస్‌ గెలుపొందగా.. రెండు స్థానాల్లో ముందంజలో ఉంది.

* మణిపూర్‌లో ఐదు స్థానాలకు ఉపఎన్నికలు జరిగాయి. ఇప్పటికే నాలుగు స్థానాల్లో భాజపా, మరోస్థానంలో ఇండిపెండెంట్‌ అభ్యర్థి విజయం సాధించారు.

* నాగాలాండ్‌లో రెండు అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరిగాయి. ఇక్కడ ఒక స్థానంలో ఇండిపెండెంట్‌ అభ్యర్థి, మరోస్థానంలో ఎన్‌డీపీపీ అభ్యర్థి విజయం సాధించారు. ఇక్కడ రెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ ఒక్కశాతం ఓట్లు కూడా సాధించలేదు. ఇక భాజపాకు మాత్రం 14శాతం ఓట్లు వచ్చినప్పటకీ పోటీ ఇవ్వలేకపోయింది.

* ఒడిశాలో రెండు స్థానాలకు ఉపఎన్నికలు జరగ్గా.. ఇక్కడ రెండు స్థానాల్లోనూ బిజూ జనతాదళ్‌(బీజేడీ) విజయం సాధించింది.

* తెలంగాణలో ఒక స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. ఇక్కడ భాజపా విజయం సాధించింది. అయితే, భాజపా, తెరాస పార్టీల మధ్య చివరివరకూ హోరాహోరీ పోరు కొనసాగింది. చివరకు వెయ్యి ఓట్ల మెజారిటీతో భాజపా అభ్యర్థి విజయం సాధించారు.

*ఉత్తర్‌ప్రదేశ్‌లో ఏడు స్థానాలకు ఉపఎన్నికలు జరిగాయి. ఇక్కడ ఆరు స్థానాల్లో భాజపా, ఒకచోట ఎస్పీ విజయం సాధించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని