విమాన ప్రమాదం: ఎటు చూసినా రోదనలే..! 

కేరళలోని కొలికోడ్‌ విమానాశ్రయంలో ఘోర విమాన ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో ఇప్పటివరకు.......

Published : 08 Aug 2020 18:50 IST

కొలికోడ్‌: కేరళలోని కొలికోడ్‌ విమానాశ్రయంలో ఘోర విమాన ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో పలువురు మృతిచెందగా..149మంది వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్నారు. ఇప్పటివరకు 23 మంది డిశ్చార్జి అయ్యారు. అయితే, నిన్న రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనలో గాయపడిన ఓ ప్రయాణికుడు తనకెదురైన భయానక అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ.. ‘‘అదో పెద్ద విషాదం. మేమంతా పడిపోకుండా ఉండేందుకు మమ్మల్ని మేం బ్యాలెన్స్‌చేసుకొనే ప్రయత్నంలో ముందు సీట్లను పట్టుకున్నాం. కానీ విమానం ఒక్కసారిగా కూలి రెండు ముక్కలైపోయింది’’ అని తెలిపారు. 

‘‘ఆ సమయంలో చుట్టూ ఉన్నవారంతా రోదిస్తున్నారు. అప్పుడే ఎవరో చెప్పారు.. ఇద్దరు పైలట్లు, ఇద్దరు మహిళలు చనిపోయారని. ఈ రోజు దినపత్రికల్లో  17 నుంచి 18మంది చనిపోయినట్టు చదివాను. దీనికి బహుశా వాతావరణమే కారణం కావొచ్చు. పరిస్థితి అనుకూలించకపోతే విమానాన్ని మరో విమానాశ్రయంలో ల్యాండ్‌ చేసే ప్రయత్నం చేయాల్సింది.  కానీ ఇదంతా ఓ కలలా జరిగిపోయింది’’ అని తెలిపాడు. 

కరోనా మహమ్మారి కోరలు చాస్తోన్న నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌తో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను తీసుకొచ్చేందుకు చేపట్టిన వందేభారత్‌ కార్యక్రమంలో భాగంగా ఈ విమానం సేవలందిస్తోంది. ఇందులో భాగంగా దాదాపు 190 మంది ప్రయాణికులు, సిబ్బందితో కొలికోడ్‌కు చేరుకున్న విమానం ఘోర ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని