
‘ప్రభుత్వాన్ని మోకాళ్ల మీద నిల్చోబెట్టింది’
కేంద్రంపై విమర్శలు గుప్పించిన మెహబూబా ముఫ్తీ
దిల్లీ: రాజధానిలో నిరసనలు చేపట్టిన రైతులు ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తిచూపారని జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. శాంతీయుత నిరసనలతో రైతులు ప్రభుత్వాన్ని మోకాళ్ల మీద నిల్చోబెట్టారని ఆమె పేర్కొన్నారు. రైతుల ఉద్యమానికి మద్దతుగా నిలుస్తూ ముఫ్తీ ట్విటర్ వేదికగా కేంద్రంపై మండిపడ్డారు. ‘రైతులు శాంతీయుత నిరసనలతో కేంద్ర ప్రభుత్వాన్ని మోకాళ్లమీద నిల్చోబెట్టారు. ఆర్టికల్ 370ని చట్టవిరుద్ధంగా రద్దు చేసినప్పటినుంచి భాజపా ప్రజలకు భయపడుతోంది. అన్ని రంగాల్లో విఫలమవుతూ దేశంలో శాంతిభద్రతలకు ఆటంకం కలిగిస్తోంది’ అంటూ విమర్శలు గుప్పించారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రాజధాని దిల్లీలో రైతులు ఉద్యమం చేపట్టారు. పంజాబ్ నుంచి తరలివచ్చిన వేలాదిమంది రైతులు హస్తిన సరిహద్దుల్లో నిరసన తెలుపుతున్నారు. పలు రాష్ట్రాలకు చెందిన కర్షకులు, ఇతర పార్టీ నేతలు వారికి మద్దతుగా నిలిచారు. కాగా ప్రభుత్వం రైతులతో చర్చలు జరిపినా అవి ఫలించలేదు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.