కేంద్రంతో చర్చలకు వెళ్లాలా? వద్దా?

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళనలు, రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. దేశ రాజధానిలో రోజురోజుకీ పడిపోతున్న ఉష్ణోగ్రతలతో గడ్డకట్టే చలిలోనూ అన్నదాతలు తమ..........

Published : 23 Dec 2020 17:20 IST

ముగిసిన రైతు సంఘాల నేతల భేటీ .. కాసేపట్లో ప్రెస్‌మీట్‌

దిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళనలు, రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. దేశ రాజధానిలో రోజురోజుకీ పడిపోతున్న ఉష్ణోగ్రతలతో గడ్డకట్టే చలిలోనూ అన్నదాతలు తమ పట్టును సడలించడం లేదు. కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి ఆ చట్టాలను ఉపసంహరించుకొనేదాకా తమ పోరాటం ఆగదని అన్నదాతలు తేల్చి చెబుతున్నారు. సోమవారం నుంచి రిలే నిరాహార దీక్షలు ప్రారంభించిన రైతు సంఘాల నేతలు రోజుకు కనీసం 11 మందికి తక్కువ కాకుండా నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. సింఘూ సరిహద్దు వద్ద రైతులు బారులు తీరి బైఠాయించి తమ పోరాటం కొనసాగిస్తున్నారు. సింఘూ సరిహద్దు వద్ద దాదాపు 10 నుంచి 15 కి.మీల మేర దిల్లీ- హరియాణా రహదారిపై రైతులు బారులు తీరినట్టు స్థానికులు పేర్కొంటున్నారు. ఎప్పటికప్పుడు తమ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేలా రైతు సంఘాల నేతలు ప్రసంగాలు ఇస్తున్నారు. 

చర్చలపై కాసేపట్లో నిర్ణయం

కేంద్రం తీసుకొచ్చిన చట్టాలు తమ ఆమోద యోగ్యం కాదని, రైతులకు అవి మేలు చేసే చట్టాలు కాదని రైతు సంఘాల నేతలు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి వాటిని వెనక్కి తీసుకొచ్చేదాకా వెనక్కి వెళ్లేది లేదంటున్నారు. మరోవైపు, కేంద్రంతో 5 దఫాలుగా చర్చలు జరిగినా ఎలాంటి ఫలితం లేకపోయింది.  దీంతో రోజురోజుకూ తమ కార్యాచరణను ప్రకటించుకుంటూ ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని రైతు నేతలు హెచ్చరిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యలో మరో దఫా చర్చలకు రైతులను ఆహ్వానిస్తూ కేంద్ర ప్రభుత్వం రాసిన లేఖపై రైతు సంఘాల నేతలు సమావేశమై చర్చించారు. కేంద్రంతో ఆరో దఫా చర్చలు జరపాలా? వద్దా? అనే అంశంపై సాయంత్రం 5.30గంటలకు మీడియాకు వెల్లడించనున్నారు. 

ఎన్నాళ్లైనా.. ఎంతకష్టమైనా..

సింఘు, టిక్రీ, ఘాజీపూర్‌ రహదారులపై బైఠాయించిన రైతులు చట్టాలు వెనక్కి తీసుకుంటేనే పోరాటం విరమిస్తామని చెబుతున్నారు. లేకపోతే ఎన్నాళ్లైనా, ఎంత కష్టమైనా ఆందోళనలు కొనసాగిస్తామని తేల్చి చెబుతున్నారు. దిల్లీలో గత వారం పది రోజులుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న  నేపథ్యంలో రాత్రిళ్లు సైతం ఇదే రహదారిపై బైఠాయించి తమ పోరాటాన్ని అన్నదాతలు ముందుకు తీసుకెళ్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని