రెండోసారి ఈడీ ముందు హాజరైన ఫరూక్‌

జమ్మూకశ్మీర్‌ క్రికెట్ అసోసియేషన్‌లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల విషయంలో నేషనల్‌ కాన్ఫరెన్స్(ఎన్‌సీ) అధినేత,‌ ఎంపీ ఫరూక్‌ అబ్దుల్లాను బుధవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రెండోసారి ప్రశ్నించింది..........

Updated : 21 Dec 2022 15:29 IST

దిల్లీ: జమ్మూకశ్మీర్‌ క్రికెట్ అసోసియేషన్‌లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల విషయంలో నేషనల్‌ కాన్ఫరెన్స్(ఎన్‌సీ) అగ్రనేత,‌ ఎంపీ ఫరూక్‌ అబ్దుల్లాను బుధవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రెండోసారి ప్రశ్నించింది. ఈడీ నుంచి అందిన సమన్ల మేరకు ఈరోజు ఆయన రాజ్‌బాగ్‌లోని ప్రాంతీయ కార్యాలయంలో అధికారుల ముందు హాజరయ్యారు. దీనిపై ఎన్‌సీ వర్గాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. కశ్మీర్‌లో ఒక్కతాటిపైకి వచ్చిన పార్టీలను బెదిరించడానికే ప్రభుత్వం ఇలాంటి కుట్రలకు తెరతీసిందని ఆరోపించారు. మరోవైపు తన తండ్రి 84వ పుట్టినరోజే ఈడీ అధికారులు సమన్లు జారీ చేయడంపై ఫరూక్‌ తనయుడు, మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.  

అధికరణ 370 రద్దు పునరుద్ధరణ కోసం అక్కడి రాజకీయ పార్టీలన్నీ కలిసి గురువారం ‘పీపుల్స్‌ అలయన్స్‌ ఫర్ గుప్కర్‌ డిక్లరేషన్‌’ను ఏర్పాటు చేశాయి. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను పునరుద్ధరించే ఉద్దేశంతో అక్కడి పార్టీలను ఒక్కతాటిపైకి తీసుకు వచ్చేందుకు అబ్దుల్లా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. ఆర్థిక నేరాలపై దర్యాప్తు చేసే ఈడీ జమ్మూకశ్మీర్‌ క్రికెట్ సంఘంలో చోటు చేసుకున్న మనీలాండరింగ్ ఆరోపణలపై సీబీఐ దర్యాప్తును పరిగణనలోకి తీసుకొని అబ్దుల్లాను ప్రశ్నించింది. 2002-11 మధ్యకాలంలో రూ.43.69 కోట్లను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలతో ఆయనతో పాటు మరో ముగ్గురిపై సీబీఐ గతంలో అభియోగ ప్రతం దాఖలు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని