40 నిమిషాల్లో కరోనా పరీక్ష

టాటా మెడికల్‌ డయాగ్నస్టిక్స్‌ (టాటా ఎండీ), అపోలో గ్రూప్‌ ఆఫ్‌ హాస్పిటల్స్‌ సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఫెల్యుడా పేపర్‌ స్ట్రిప్‌ కరోనా కిట్‌లను దిల్లీలో ప్రారంభించారు. ‘టాటా ఎమ్‌డీ చెక్’ పేరిట దీనిని మార్కెట్‌లోకి తీసుకొచ్చారు. దీని ద్వారా కేవలం 40 నిమిషాల్లోనే ఫలితాన్ని నిర్ధారించవచ్చు. ధర కూడా ప్రస్తుతమున్న ఆర్‌టీ-పీసీఆర్‌ టెస్టు కిట్ల కంటే తక్కువగా ఉంటుందని టాటా గ్రూప్‌ వెల్లడించింది...

Published : 19 Nov 2020 12:24 IST

దిల్లీలో ప్రారంభించిన టాటాఎండీ

దిల్లీ: టాటా మెడికల్‌ డయాగ్నస్టిక్స్‌ (టాటా ఎండీ), అపోలో గ్రూప్‌ ఆఫ్‌ హాస్పిటల్స్‌ సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఫెలుడా పేపర్‌ స్ట్రిప్‌ కరోనా కిట్‌లను దిల్లీలో ప్రారంభించారు. ‘టాటా ఎండీ చెక్’ పేరిట దీనిని మార్కెట్‌లోకి తీసుకొచ్చారు. దీని ద్వారా కేవలం 40 నిమిషాల్లోనే ఫలితాన్ని నిర్ధారించొచ్చు. ధర కూడా ప్రస్తుతమున్న ఆర్‌టీ-పీసీఆర్‌ టెస్టు కిట్ల కంటే తక్కువగా ఉంటుందని టాటా గ్రూప్‌ వెల్లడించింది. సీఆర్‌ఐఎస్‌పీఆర్‌ టెక్నాలజీ ద్వారా దీనిని అభివృద్ధి చేశారు. ఇది ఇంట్లో సాధారణంగా గర్భ నిర్ధారణ చేసుకునే కిట్‌ మాదిరిగా ఉంటుంది. బాధితుడి నుంచి స్వాబ్‌ను సేకరించాక థర్మోసైక్లింగ్‌ విధానంలో దాని నుంచి ఆర్ఎన్‌ఏను వేరు చేస్తారు. అనంతరం ఫెలుడా పేపర్‌ స్ట్రిప్‌ కిట్‌పై ప్రయోగిస్తే దానిపై ఉండే బార్‌కోడ్‌ ఆధారంగా కరోనాను నిర్ధారించే వీలుంటుంది. దీనికోసం ల్యాబ్‌లు అవసరమైనప్పటికీ, చిన్నిపాటి మొబైల్‌ ల్యాబ్‌ల ద్వారానూ పరీక్షించవచ్చని టాటాఎండీ తెలిపింది.

ఈ కిట్‌ భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌), డ్రగ్స్‌ కంట్రోలర్‌ ఆఫ్‌ ఇండియా (డీజీసీఐ) అనుమతి పొందినట్లు టాటాఎండీ వెల్లడించింది. ‘‘విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు తదితర ప్రాంతాల్లో వీటిని ఉపయోగించొచ్చు. 98 శాతం కచ్చితత్వంతో పని చేస్తుంది. పాజిటివ్‌, నెగటివ్‌ కేసులు రెండింటినీ గుర్తించగలదు. నిరీక్షణ సమయాన్ని తగ్గించేందుకు ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. అదే సమయంలో నిర్దిష్టమైన ఫలితాలను అందిస్తుంది’’ అని టాటా ఎండీ ప్రకటన విడుదల చేసింది. ఇదే రకమైన కిట్లను అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఉపయోగిస్తోందని గుర్తు చేసింది. త్వరలో తమిళనాడుకు ఈ కిట్లను సరఫరా చేయబోతున్నట్లు చెప్పింది. కోటి కిట్లకు ఆర్డర్లు వచ్చాయని, ఈ మేరకు సురక్షిత వాతావరణంలో సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని టాటాఎండీ వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని