అమెరికాలో కరోనా సోకిన తొలి శునకం మృతి!

అమెరికాలో మొదటిసారిగా కరోనా సోకిన పెంపుడు శునకం ప్రాణాలు కోల్పోయింది.

Published : 01 Aug 2020 01:53 IST

వైరస్‌సోకిన వ్యక్తులు పెంపుడు జంతువులకు దూరంగా ఉండాలంటున్న నిపుణులు 
జంతువుల నుంచి వ్యక్తులకు వైరస్‌ సోకదని స్పష్టం

న్యూయార్క్‌: కరోనా వైరస్‌ మానవులకే కాదు కొన్ని సందర్భాల్లో జంతువులకు కూడా సోకుతున్న విషయం తెలిసిందే. అమెరికాలో కొన్ని జంతువుల్లో వైరస్‌ బయటపడ్డట్లు ఇప్పటికే అధికారులు గుర్తించారు. అమెరికాలో మొదటిసారిగా కరోనా సోకిన పెంపుడు శునకం ప్రాణాలు కోల్పోయింది.

న్యూయార్క్‌కు చెందిన ఓ వ్యక్తి జర్మన్‌ షపర్డ్‌ సంతతికి చెందిన శునకాన్ని పెంచుతున్నాడు. తొలుత ఆ వ్యక్తికి వైరస్‌ నిర్ధారణ అయ్యింది. కొన్నిరోజులకు శునకానికీ శ్వాసకోస సమస్యలు ఎదురయ్యాయి. దీంతో మే నెలలో పరీక్షలు నిర్వహించగా వైరస్‌ సోకినట్లు పశువైద్యులు ధృవీకరించారు. ఈ విషయాన్ని అక్కడి వ్యవసాయ శాఖ జూన్‌ నెలలో అధికారికంగా వెల్లడించింది. కొన్ని వారాలకు శునకం ఆరోగ్యం మరింత క్షీణించింది. దీంతో జులై 11న ఆ శునకం మృతిచెందింది. శునకం చనిపోయే ముందు దానికి కాన్సర్‌ సంబంధ లక్షణాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అయితే, వైరస్‌ కారణంగా కాన్సర్‌ వృద్ధి చెంది శునకం మరణించిందా? లేక నేరుగా వైరస్‌ వల్ల మరణించిందా? అనే విషయంపై స్పష్టత రాలేదు. విషయం తెలుసుకున్న న్యూయార్క్‌ ఆరోగ్యశాఖ అధికారులు యజమాని ఇంటికి వెళ్లేసరికి అంత్యక్రియలు పూర్తి అయినట్లు గుర్తించారు. ఈ విషయాలను శునకం యజమాని నేషనల్‌ జియోగ్రఫీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. 

మానవాళిని అతలాకుతలం చేస్తోన్న కరోనా వైరస్‌ మహమ్మారి జంతువులకూ సోకుతున్నట్లు ఇదివరకే వార్తలు వచ్చాయి. అరుదైన సందర్భాల్లో కరోనా సోకిన వ్యక్తులనుంచి జంతువులకు వైరస్‌ సోకుతున్నట్లు అమెరికా వ్యవసాయశాఖ ఇదివరకే వెల్లడించింది. దీనిపై ఇంకా పరిశోధనలు కొనసాగుతున్నప్పటికీ వైరస్‌ సోకిన వ్యక్తులు వాటికి దూరంగా ఉండాలని సూచించింది. ఇప్పటికే అమెరికాలో పదుల సంఖ్యలో పెంపుడు శునకాలు, పిల్లులు ఈ వైరస్‌ బారినపడ్డట్లు గుర్తించింది. జంతుప్రదర్శనశాలలోని పులులు, సింహాలకూ వైరస్‌ సోకినట్లు అమెరికా ఆరోగ్యశాఖ అధికారులు ధృవీకరించారు. జంతువులకు వైరస్‌ ఎలా సోకిందనే విషయంపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. అయితే జంతువుల నుంచి వ్యక్తులకు మాత్రం వైరస్‌ సోకే అవకాశాలు లేవని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

ఇవీ చదవండి..
యువతకూ ముప్పే..: WHO హెచ్చరిక
సరైన వెంటిలేషన్‌ లేకుంటే వైరస్‌తో ఉక్కిరిబిక్కిరే!


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని