30 ఏళ్ల వ్యక్తికి ‘కోవాక్సిన్‌’ మొదటి డోస్‌

భారతదేశపు మొట్టమొదటి కరోనా నివారణ టీకా కోవాక్సిన్‌ క్లినికల్‌ పరీక్షలు మొదలయ్యాయి. శుక్రవారం దిల్లీ ఎయిమ్స్‌లో..

Published : 24 Jul 2020 21:32 IST

దిల్లీ ఎయిమ్స్‌లో మొదలైన క్లినికల్‌ పరీక్షలు

దిల్లీ: భారతదేశపు మొట్టమొదటి కరోనా నివారణ టీకా కోవాక్సిన్‌ క్లినికల్‌ పరీక్షలు మొదలయ్యాయి. శుక్రవారం దిల్లీ ఎయిమ్స్‌లో ఓ 30 ఏళ్ల వ్యక్తికి టీకా మొదటి డోస్‌ వేశారు. క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించుకునేందుకు అనేక మంది ముందుకు వచ్చారు. గత శనివారం వరకు దాదాపు 3500 మంది వాలంటీర్లు ఎయిమ్స్‌లో పేరు నమోదు చేసుకున్నారు. వారిలో 22 మందికి స్క్రీనింగ్ జరుపుతున్నట్లు ఎయిమ్స్‌లోని సెంటర్ ఫర్ కమ్యూనిటీ మెడిసిన్ ప్రొఫెసర్, ప్రధాన పరిశోధకుడు డాక్టర్ సంజయ్ రాయ్ వెల్లడించారు. ‘మొదటి వాలంటీర్, దిల్లీ నివాసిని రెండు రోజుల క్రితం పరీక్షించాం. అతడు ఆరోగ్యంగానే ఉన్నాడు. ఈరోజు మధ్యాహ్నం 1.30 గంటలకు అతడికి మొదటి డోస్‌ 0.5 ఎమ్‌ఎల్‌ టీకా ఇచ్చాం. ఇప్పటివరకు ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ కనిపించలేదు. ఇంకా ఏడు రోజులపాటు అతడిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచనున్నాం’ అని రాయ్‌ పేర్కొన్నారు. స్క్రీనింగ్‌ రిపోర్టులు వచ్చిన తర్వాత శనివారం మరికొంతమందిని పరీక్షించనున్నారు.

కోవాక్సిన్‌ పరీక్షలు నిర్వహించేందుకు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎమ్‌ఆర్‌) ఎంపిక చేసిన 12 సైట్లలో ఎయిమ్స్‌ ఒకటి. మొదటి దశలో 375 మంది వాలంటీర్లను పరీక్షిస్తుండగా అందులో ఎయిమ్స్‌లో నమోదు చేసుకున్నవారే దాదాపు 100 మంది. రెండో దశలో 12 సైట్లలోని 750 మందిపై పరీక్షలు జరపనున్నట్లు రాయ్‌ తెలిపారు. 18-55 ఏళ్ల మధ్య వయసున్న ఆరోగ్యవంతులకు ఫేజ్‌ 1లో టీకా ఇవ్వనున్నారు. గర్భవతులు కాని మహిళలను కూడా మొదటి దశలో పరీక్షిస్తారు. రెండో దశలో 12-65 సంవత్సరాల మధ్య ఉన్నవారిని ఎంచుకోనున్నట్లు ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రణదీప్‌ గులేరియా స్పష్టం చేశారు. ‘మొదటి దశలో టీకా ద్వారా భద్రతను, డోస్‌ శాతాన్ని లెక్కించనున్నాం’ అని ఆయన పేర్కొన్నారు. 

ఐసీఎమ్‌ఆర్‌తోపాటు నేషనల్ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ వైరాలజీ(ఎన్‌ఐవీ) సహకారంతో హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ కోవాక్సిన్‌ టీకాను అభివృద్ధి చేసింది. మానవులపై క్లినికల్ పరీక్షల కోసం డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) నుంచి కోవాక్సిన్‌కు ఇటీవలే అనుమతి లభించింది.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని