ఆహార పదార్థాలతో కరోనా వ్యాపించదు: WHO

ఆహార ఉత్పత్తులు, వాటి ప్యాకేజింగ్ నుంచి కరోనా వ్యాపించే అవకాశం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రజలు ఆహార సరఫరాలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడించింది...

Published : 14 Aug 2020 19:53 IST

జెనీవా: ఆహార ఉత్పత్తులు, వాటి ప్యాకేజింగ్ నుంచి కరోనా వ్యాపించే అవకాశం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఒక ప్రకటనలో తెలిపింది. ప్రజలు ఆహార సరఫరాలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడించింది. రెండు రోజుల క్రితం చైనాలోని జియాన్‌, షెన్‌జెన్‌ నగరాలకు బ్రెజిల్ నుంచి దిగుమతి చేసుకున్న చికెన్‌ వింగ్స్‌, ఈక్వెడార్ నుంచి వచ్చిన రొయ్యల ఉత్పత్తుల్లో కరోనా వైరస్‌ను గుర్తించినట్లు అక్కడి చైనా అధికారులు వెల్లడించారు. ఈ విషయంలో వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని వారు ప్రజలకు సూచించారు.

తాజాగా చైనా ప్రకటనపై డబ్ల్యూహెచ్‌వో స్పందించింది. ‘‘ప్రజలు ఆహార పదార్థాలు, వాటి ప్యాకేజింగ్, ప్రాసెసింగ్, ఫుడ్ డెలివరీ గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఆహార పదార్థాలు, ఫుడ్ చైన్‌ ద్వారా వైరస్‌ వ్యాపిస్తుంది అనేందుకు ఎలాంటి ఆధారాలూ లేవు. వినియోగదారులు వాటిని ఎలాంటి ఆందోళన లేకుండా సౌకర్యవంతంగా ఉపయోగించుకోవచ్చు’’ అని డబ్లూహెచ్‌వో ఎమర్జెన్సీ ప్రోగ్రామ్‌ హెడ్ మైక్‌ ర్యాన్‌ తెలిపారు. అలానే చైనా ఎన్నో వేల ప్యాకేజీలను పరిశీలించగా చాలా తక్కువ స్థాయిలో వైరస్‌ కారకాలను గుర్తించినట్లు డబ్ల్యూహెచ్‌వో ఎపిడిమాలజిస్ట్ మరియ వాన్‌ కెర్‌ఖోవ్‌ పేర్కొన్నారు. చైనా ఆరోపణలపై బ్రెజిల్, ఈక్వెడార్ స్పందించాయి. తమ దేశం కరోనా నిబంధనలను కఠినంగా పాటిస్తుందని, ప్యాకేజీలు ఓ సారి దేశం దాటాక వాటితో తమకు సంబంధం లేదని ఈక్వెడార్ తెలిపింది. చైనా కనుగొన్న దానిపై పూర్తి సమాచారం కోసం వేచిచూస్తున్నట్లు బ్రెజిల్‌ ప్రకటించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని